- తగ్గుముఖం పట్టిన అంతర్జాతీయ చమురు ధరలు
వాషింగ్టన్ : హోర్ముజ్ జలసంధి ద్వారా నౌకా రవాణాను పునఃప్రారంభించేందుకు ఒమన్‌తో మధ్యంతర ఒప్పందం కుదుర్చుకోనున్నట్లు ఇరాన్ ప్రకటించడంతో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు స్వల్పంగా తగ్గాయి. హోర్ముజ్ జలసంధిలో సార్వభౌమాధికారాన్ని కాపాడుతూ, అమెరికా ఒత్తిడిని ఎదుర్కొంటూనే నౌకాయానాన్ని పునరుద్ధరించే దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు ఇరాన్ తెలిపింది. గురువారం ట్రేడింగ్‌లో బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ బ్యారెల్‌కు 37 సెంట్లు లేదా 0.5 శాతం తగ్గి 79.08 డాలర్లకు చేరుకోగా, యూఎస్ వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ (WTI) ధర 53 సెంట్లు లేదా 0.7 శాతం క్షీణించి 74.69 డాలర్ల వద్ద ట్రేడైంది. మార్కెట్ విశ్లేషకుల ప్రకారం, హోర్ముజ్ జలసంధి మళ్లీ తెరుచుకునే అవకాశాలపై పెట్టుబడిదారుల్లో ఆశావహ వాతావరణం నెలకొనడంతో చమురు సరఫరాపై ఉన్న ఆందోళనలు కొంత మేర తగ్గాయి. దీంతో అంతర్జాతీయ చమురు ధరలు స్వల్పంగా దిగివచ్చాయి. అయితే మరోవైపు, ఐరోపాలో కొనసాగుతున్న తీవ్ర వడగాలులు, కరువు పరిస్థితులు ఇంధన రంగంపై ప్రభావం చూపుతున్నాయి. అధిక ఉష్ణోగ్రతల కారణంగా రిఫైనరీల కార్యకలాపాలు అంతరాయం కలుగుతున్నాయని, దీనివల్ల ఇంధన ఉత్పత్తి సామర్థ్యం తగ్గే అవకాశాలు ఉన్నాయని నివేదికలు సూచిస్తున్నాయి.








కామెంట్‌లు (0)