శనివారం, 05 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

సుభాష్‌ చంద్రపై సిబిఐ ఎఫ్‌ఐఆర్‌ నమోదు

1 గంట క్రితం

lic
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 05, 2026, 11:45 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

- నికర సంపదను పెంచి చూపిన జీ గ్రూప్‌ ఛైర్మన్‌

- నిధుల దుర్వినియోగం

న్యూఢిల్లీ : బ్యాంక్‌‌లను రూ.22వేల కోట్లకు నిండా ముంచిన జీ గ్రూప్‌ ‌ఛైర్మన్‌ ‌సుభాష్‌ ‌చంద్రపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) ఎట్టకేలకు ఎఫ్‌ఐఆర్‌ ‌నమోదు ‌చేసింది. బ్యాంక్‌‌లను మోసం చేసిన ఆరోపణలపై సుభాష్ చంద్రతో పాటు మరో ముగ్గురిపై శనివారం ఎఫ్‌ఐఆర్ బుక్‌ చేసింది. ఎల్‌ఐసి హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ నుంచి రూ.980 కోట్ల మేర రెండు రుణాలు పొందేందుకు సుభాష్ చంద్ర తన నికర విలువను భారీగా పెంచి చూపారన్న ఆరోపణలపై ఈ కేసు నమోదయ్యింది. వసంత్ సాగర్ ప్రాపర్టీస్ ప్రయివేటు లిమిటెడ్‌కు పాన్ ఇండియా ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ సహకారంతో రూ.500 కోట్ల రుణాన్ని అలాగే డిజిటల్ సబ్‌స్క్రైబర్ మేనేజ్‌మెంట్ అండ్ కన్సల్టెన్సీ సర్వీసెస్‌‌కు స్పిరిట్ ఇన్ఫ్రా పవర్ అండ్ మల్టీ వెంచర్స్ సహకారంతో రూ.480 కోట్ల రుణాన్ని ఎల్‌ఐసిహెచ్‌ఎఫ్‌ఎల్ మంజూరు చేసింది. ‌స్వాధీనాలు, టాప్ అప్, వ్యాపార విస్తరణ నిమిత్తం మంజూరైన మొదటి రుణానికి 2018 మార్చి 28న, రెంటల్ సెక్యూరిటైజేషన్ పథకం కింద మంజూరైన రెండో రుణానికి సుభాష్ చంద్ర కొనసాగింపు గ్యారెంటీలను సమకూర్చారు. ఈ రెండు రుణాలు తదనంతరం ఎగవేత బారిన పడ్డాయి.

అప్పుడు రూ.59,000 కోట్లు.. ఇప్పుడు రూ.31.79 కోట్లు!

రుణాలు పొందేందుకు సమర్పించిన పత్రాల్లో వసంత్ సాగర్ రుణానికి సంబంధించి 2018 మార్చి 28న డిఐఎం అండ్ కో జారీ చేసిన సర్టిఫికెట్‌లో సుభాష్ చంద్ర తన నికర విలువను సుమారు రూ.59,000 కోట్లుగా చూపించారు. అలాగే డిజిటల్ సబ్‌స్క్రైబర్ రుణానికి సంబంధించి 2018 జులై 6న ఎంపిజె అండ్ కో జారీ చేసిన సర్టిఫికెట్‌లో నికర విలువను రూ.40,562 కోట్లుగా పేర్కొన్నారు. అయితే దివాలా, దివాలాస్మృతి (ఐబిసి) 2016 నిబంధనల కింద జరిగిన తదనంతర చర్యలలో ఇటీవల ఎన్‌‌సిఎల్‌‌టిలో ఆయన ఈ సర్టిఫికెట్లలోని వివరాలను తిరస్కరించారు. 2024 నాటికి తన నికర విలువ కేవలం రూ.31.79 కోట్లేనని.. అలాగే 2017-18 కాలంలో తన నికర విలువ రూ.40,000 కోట్లకు మించలేదని ఆయన పేర్కొనడం విశేషం.

కుమ్మక్కై దుర్వినియోగం..

వసంత్ సాగర్ ప్రాపర్టీస్, పాన్ ఇండియా ఇన్ఫ్రాప్రాజెక్ట్స్, డిజిటల్ సబ్‌స్క్రైబర్ మేనేజ్‌మెంట్, స్పిరిట్ ఇన్ఫ్రాపవర్‌ సంస్థలు, వాటి అధికారులతో సుభాష్ చంద్ర కుమ్మక్కై తప్పుడు పత్రాలను సృష్టించారని సిబిఐ ఎఫ్‌ఐఆర్ ఆరోపించింది. తప్పుడు నికర విలువతో ఎల్‌ఐసి హెచ్‌ఎఫ్‌ఎల్‌ను మోసగించి నిధులను పొంది వాటిని దుర్వినియోగం చేశారని, రుణదాత నమ్మకాన్ని వమ్ము చేశారని పేర్కొంది. వ్యక్తిగత దివాలా ప్రక్రియలో భాగంగా నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్‌‌సిఎల్‌‌టి) ఐదుగురు సభ్యుల బెంచ్‌ను ఏర్పాటు చేయడాన్ని సుభాష్ చంద్ర వ్యతిరేకించిన మూడు రోజులకు సిబిఐ ఈ కేసు నమోదు చేసింది. ఈ కేసులో వ్యక్తిగత హామీదారుగా సుభాష్ చంద్ర రూ.6.25 కోట్లు చెల్లిస్తే సరిపోతుందని ఎన్‌‌సిఎల్‌‌టి తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. ఈ పరిష్కార ప్రణాళికను ఎల్‌ఐసిహెచ్‌ఎఫ్‌ఎల్, హెచ్‌‌డిఎఫ్‌‌సి బ్యాంకు, యాక్సిస్ బ్యాంకు, కెనరా బ్యాంకు, ఆర్‌బిఎల్‌ బ్యాంకు, యూనియన్ బ్యాంకులు తదితర విత్త రుణదాతసంస్థలు వ్యతిరేకించాయి. తమకు రావాల్సిన సుమారు రూ.22,006 కోట్ల వాస్తవ దావాకు బదులుగా కేవలం రూ.6.25 కోట్లు మాత్రమే ఆఫర్ చేయడం అన్యాయమని, చట్టవిరుద్ధమని ఎల్‌ఐసిహెచ్‌ఎఫ్‌ఎల్ ఆందోళన వ్యక్తం చేయడంతో ఈ పరిణామాలన్నీ చోటుచేసుకున్నాయి.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్