సోమవారం, 24 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

డిపాజిట్ల కంటే రుణాలే అధికం

1 గంట క్రితం

bank
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 25, 2026, 12:07 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

- రాష్ట్రంలో బ్యాంకుల తీరు

ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి - అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో బ్యాంకులు సేకరిస్తున్న డిపాజిట్లు కన్నా వివిధ రంగాలకు ఇస్తున్న రుణాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ పరిస్థితి బ్యాంకు అధికారుల్లో ఆందోళన కలిగిస్తోంది. అధికారులు తయారు చేసిన నివేదిక ప్రకారం రుణాలు రూ.11,534 కోట్ల నుంచి రూ.30,993 కోట్లకు చేరుకున్నాయి. ఈ స్థాయి వృద్ధి జాతీయ స్థాయితో పోలిస్తే అసాధారణమని చెబుతున్నారు. రాష్ట్రంలో మొత్తం బ్యాంకు డిపాజిట్ల పెరుగుదల కూడా గత ఏడాదికన్నా కనిపించింది. ఈ పెరుగుదల 7,661 కోట్ల నుంచి 13,492 కోట్లకు పెరిగినట్టు గుర్తించారు. ఇది 76.11 శాతం వృద్ధి. అయినప్పటికీ రుణాల వృద్ధితో పోలిస్తే డిపాజిట్ల సమీకరణ వెనుకబడి ఉన్నట్టు చెబుతున్నారు. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు ఇచ్చే రుణాల వాటా 39 శాతం నుంచి 41 శాతానికి పెరిగింది. స్వయం సహాయక సంఘాలకు ఇచ్చిన రుణాలు కూడా 5.44 శాతం పెరిగాయి. ఈ రంగాలకు ఇది కొంతవరకు ఉపయుక్తమేనని అధికారులు విశ్లేషిస్తున్నారు. ప్రాధాన్య రంగాలకు ఇచ్చే రుణాల వాటా కూడా 32 శాతం నుంచి 33.52 శాతానికి పెరిగింది. అంటే 1.52 శాతం పాయింట్ల పెరుగుదల నమోదైంది. అదేవిధంగా వ్యవసాయ రుణాల వాటా 31 శాతం నుంచి 31.56 శాతానికి స్వల్పంగా పెరిగింది.

రుణాలు-డిపాజిట్ల నిష్పత్తిపై ఆందోళన

ప్రధానంగా క్రెడిట్-డిపాజిట్ నిష్పత్తిపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని బ్యాంకర్లు చెబుతున్నారు. ఇది 1.51 నుంచి 2.30కి పెరిగినట్టు బ్యాంకర్లు చెబుతున్నాయి. బ్యాంకులు సమీకరిస్తున్న డిపాజిట్ల కంటే రుణాల పంపిణీ చాలా వేగంగా పెరుగుతున్నట్టు ఈ గణాంకాలు చెబుతున్నాయని వారంటున్నారు. ఎంఎస్ఎంఇల అభివృద్ధి, వ్యవసాయం, ఉపాధి కల్పనకు దోహదపడేలా ఉండేలా ఎస్సెల్బీసీ స్థాయిలో సమీక్ష చేయాల్సిన అవసరం ఉందని ప్రభుత్వ నివేదికలో కూడా పేర్కొన్నారు. మొత్తంగా చూస్తే రాష్ట్రంలో రుణాలు పెరగడం ఆర్థిక కార్యకలాపాలకు సానుకూల సంకేతమేనని అధికారులు అంటున్నారు. అయితే 168.71 శాతం రుణ వృద్ధి అసాధారణంగా ఉండటంతో దాని వెనుక ఉన్న కారణాలను విశ్లేషించడం, అదే సమయంలో డిపాజిట్ బేస్‌ను బలోపేతం చేయడం రాష్ట్రానికి కీలక సవాలుగా ఉంటోందని వారు చెబుతున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్