బుధవారం, 05 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionయుపిఐ చెల్లింపులపై మళ్లీ మర్చంట్ ఛార్జీలు..?

20 గంటల క్రితం

upi charges.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 05, 2026, 05:30 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

  • చట్ట సవరణకు కేంద్రం ప్రతిపాదనలు

న్యూఢిల్లీ : ​‌యుపిఐ చెల్లింపులపై మళ్లీ మర్చంట్ డిస్కౌంట్ రేట్ (ఎండిఆర్‌) ‌విధించాలని బిజెపి ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన పేమెంట్‌ అండ్‌ సెటిల్‌‌మెంట్‌ ‌సిస్టమ్స్‌ ‌యాక్ట్‌ సవరణ బిల్లును కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు. ‌దీంతో బ్యాంక్‌‌లు, ఫిన్‌‌టెక్‌ ‌సంస్థలకు వ్యాపారులు కొత్తగా చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం యుపిఐ లావాదేవీలపై వ్యాపారుల నుంచి ఎలాంటి ఎండిఆర్‌ వసూలు చేయడం లేదు. అయితే డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ నిర్వహణకు బ్యాంకులు, ఫిన్‌టెక్ సంస్థలకు స్థిరమైన ఆదాయం అవసరమనే డిమాండ్‌ నేపథ్యంలో ఈ మార్పులు తీసుకురానున్నారు. ప్రభుత్వం పరిశీలిస్తున్న ప్రతిపాదన ప్రకారం వార్షిక టర్నోవర్ రూ.1.5 కోట్లకు పైగా ఉన్న వ్యాపారులు చేసే రూ.2,000కు మించిన ‌యుపిఐ లావాదేవీలపై 0.3 శాతం నుంచి 0.5 శాతం వరకు ఎండిఆర్‌ విధించే అవకాశం ఉందని తెలుస్తోంది. చిన్న వ్యాపారులు, వినియోగదారులకు మాత్రం మినహాయింపు ఉండే అవకాశాలు ఉన్నాయి.

​‌జులైలో యుపిఐ ద్వారా 2360 కోట్ల లావాదేవీలు నమోదవగా, వాటి మొత్తం విలువ రూ.29.9 లక్షల కోట్లకు చేరింది. ఫోన్‌పే, గూగుల్ పే, పేటియం వంటి సంస్థలు యుపిఐ మార్కెట్‌లో ఆధిపత్యం కొనసాగిస్తున్నాయి. బ్రోకరేజ్ సంస్థ జెఫరీస్ అంచనా ప్రకారం రూ.2,000కు పైబడిన లావాదేవీలు మొత్తం సంఖ్యలో కేవలం 4 శాతం ఉన్నాయి. వాటి విలువ మొత్తం వ్యాపార చెల్లింపుల్లో 67 శాతం ఉంటుందని అంచనా. ప్రతిపాదిత ఎండిఆర్‌ అమల్లోకి వస్తే డిజిటల్ పేమెంట్స్ పరిశ్రమకు ఏటా రూ.5,000 కోట్ల నుంచి రూ.10,000 కోట్ల వరకు అదనపు ఆదాయం సమకూరే అవకాశం ఉందని తెలిపింది. అయితే ఛార్జీల శాతం, అమలు తేదీపై ప్రభుత్వం ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు.

​వినియోగదారుల్లో తీవ్ర వ్యతిరేకత

పెద్ద మొత్తాల డిజిటల్ లావాదేవులపై కేంద్ర ప్రభుత్వం మెర్చంట్ డిస్కౌంట్ రేట్ (ఎండిఆర్) రుసుంను మళ్లీ తీసుకొస్తే తాము లావాదేవీలను నిలిపివేస్తామని సగంపైగా ప్రజలు తెలిపారు. రూ.3,000 పైచిలుకు లావాదేవుల కోసం తాము యుపిఐ వాడకాన్ని నిలిపివేస్తామని 53 శాతం మంది వినియోగదారులు ప్రముఖ సర్వే సంస్థ లోకల్ సర్కిల్స్ నిర్వహించిన సర్వేలో అభిప్రాయపడ్డారు. దేశవ్యాప్తంగా 322 జిల్లాల నుంచి 45,000 పైగా మంది నుంచి అభిప్రాయాలను సేకరించింది. రూ.3,000 కంటే ఎక్కువ విలువైన లావాదేవులపై ఎండిఆర్ విధిస్తే వారిలో 27 శాతం మంది క్రెడిట్ కార్డులకు, 14 శాతం మంది డెబిట్ కార్డులకు, మరో 12 శాతం మంది బ్యాంక్ బదిలీలు లేదా నగదు చెల్లింపులకు మారిపోతామని తెలిపినట్లు సర్వే వెల్లడించింది. అయితే వ్యాపారులే ఈ రుసుం భారాన్ని భరిస్తేనే తాము యథావిధిగా యుపిఐని వాడుతామని 18 శాతం మంది పేర్కొనగా.. తామే ఆ రుసుం చెల్లించాల్సి వచ్చినా యుపిఐని కొనసాగిస్తామని 12 శాతం మంది తెలిపారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్