- 40లక్షల ఖాతాలు తొలగించాం..
- చర్యలు మరింత కఠినం చేస్తామని వెల్లడి
న్యూఢిల్లీ: ఇన్‌స్టాగ్రామ్‌లో పిల్లలపై లైంగిక వేధింపులకు సంబంధించిన కంటెంట్‌తో కూడిన ప్రకటనలు ప్రచారంలో ఉన్నాయన్న ఆరోపణలపై మెటా స్పందించింది.తాము తెలిసి అలాంటి కంటెంట్‌ను ఎప్పటికీ అనుమతించబోమని,ఈ ఆరోపణలను తీవ్రంగా పరిగణిస్తున్నామని సంస్థ వెల్లడించింది.ఒక బ్లాగ్ పోస్టు ద్వారా వివరణ ఇచ్చిన మెటా, 2025లోనే పిల్లల లైంగిక వేధింపులకు సంబంధించిన సుమారు 40లక్షల ఖాతాలను తొలగించినట్లు తెలిపింది.పిల్లల భద్రత కోసం ఇప్పటికే పలు చర్యలు అమలు చేస్తున్నామని, ఇకపై వాటిని మరింత పటిష్ఠం చేస్తామని పేర్కొంది.ఇటీవల నిర్వహించిన దర్యాప్తులో ఇన్‌స్టాగ్రామ్‌లో డబ్బు చెల్లించి ప్రచారం చేసిన కొన్ని ప్రకటనలు వినియోగదారులను లైంగిక కంటెంట్,టెలిగ్రామ్ లింక్‌ల వైపు మళ్లిస్తున్నట్లు వెలుగులోకి వచ్చింది.నకిలీ ఖాతాల ద్వారా చేసిన పరిశీలనలో,ప్లాట్‌ఫామ్ సిఫార్సు వ్యవస్థ కూడా ఇలాంటి కంటెంట్‌ను సూచిస్తున్నట్లు దర్యాప్తు బృందం గుర్తించింది.గత వారం పిల్లల లైంగిక వేధింపులకు సంబంధించిన సుమారు 30ప్రకటనలను గుర్తించినట్లు దర్యాప్తు నివేదిక వెల్లడించింది.వాటిలో ఒక ప్రకటనపై ఫిర్యాదు చేసినప్పటికీ,అది కమ్యూనిటీ మార్గదర్శకాలను ఉల్లంఘించలేదని ఇన్‌స్టాగ్రామ్ నుంచి స్పందన వచ్చినట్లు పేర్కొంది.ఈ ఘటనపై కేంద్ర ప్రభుత్వం నోటీసు జారీ చేసిన అనంతరం మెటా తన అధికారిక వివరణను విడుదల చేసింది.








కామెంట్‌లు (0)