- స్వదేశీ ‘కామికేజ్’కు మరింత బలం..
ప్రజాశక్తి - హైదరాబాద్ : భారత రక్షణ రంగంలో స్వదేశీ సాంకేతికతకు మరింత ఊతమిచ్చేలా రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని మ్యూనిషన్స్ ఇండియా లిమిటెడ్ (ఎంఐఎల్), డ్రోగో ఏరోస్పేస్ ప్రైవేట్ లిమిటెడ్ మధ్య కీలక ఒప్పందం కుదిరింది. మానవరహిత వైమానిక వాహనాలు (యూఏవీ), లోయిటరింగ్ మ్యూనిషన్ వ్యవస్థల రూపకల్పన, అభివృద్ధిపై కలిసి పనిచేయడానికి పూణెలో జరిగిన కార్యక్రమంలో ఎంఐఎల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కుమార్ వైభవ్ గౌర్, డ్రోగో ఏరోస్పేస్ వ్యవస్థాపకుడు, సీఈఓ యశ్వంత్ బొంతు ఈ ఒప్పందపై సంతకాలు చేశారు. ఈ భాగస్వామ్యంలో భాగంగా యూఏవీ ప్లాట్‌ఫామ్ రూపకల్పన, తయారీతో పాటు ఖాళీ పేలోడ్ హార్డ్‌వేర్‌ను డ్రోగో అభివృద్ధి చేయనుండగా, రక్షణ మందుగుండు సామగ్రి, వార్‌హెడ్ సాంకేతికతలో తనకున్న నైపుణ్యాన్ని ఎంఐఎల్ అందించనుంది.
ఇటీవల హైదరాబాద్‌లో విజయవంతంగా పరీక్షించిన డెల్టా వింగ్ కామికేజ్ (త్రికోణాకార ఆత్మాహుతి డ్రోన్) వ్యవస్థకు ఈ ఒప్పందం మరింత బలాన్ని చేకూర్చనుంది. శత్రువుల లక్ష్యాన్ని సొంతంగా గుర్తించి తాము కూడా పేలిపోయేలా దీర్ఘశ్రేణి రక్షణ అవసరాల కోసం దీన్ని అభివృద్ధి చేస్తున్నారు. ఈ ఎంఒయు ద్వారా యూఏవీ ఇంజినీరింగ్, మ్యూనిషన్ సాంకేతికతలను ఒకే వేదికపైకి తెచ్చి, తదుపరి దశలైన సమీకరణ, ఫీల్డ్ పరీక్షలు, నాణ్యతా ధ్రువీకరణను వేగవంతం చేయాలని రెండు సంస్థలు లక్ష్యంగా పెట్టుకున్నాయి. భారత రక్షణ రంగాన్ని మరింత బలోపేతం చేస్తూ అత్యాధునిక స్వదేశీ మానవరహిత వ్యవస్థలను అందుబాటులోకి తేవడానికి ఈ భాగస్వామ్యం ఎంతగానో దోహదపడుతుందని యశ్వంత్ బొంతు తెలిపారు.








కామెంట్‌లు (0)