ఫైనల్లో 10వ సీడ్ ముఛోవాపై గెలుపు
నేడు జ్వెరేవ్, సిన్నర్ మధ్య టైటిల్ పోరు
లండన్: వింబబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీ మహిళల సింగిల్స్ టైటిల్‌ను 9వ సీడ్, చెక్ రిపబ్లిక్‌కు చెందిన లిండా నోస్కోవా చేజిక్కించుకుంది. సెంటర్ కోర్టులో శనివారం జరిగిన ఫైనల్లో మూడుసెట్ల హోరా హోరీ పోరులో నోస్కోవా సహచర క్రీడాకారిణి 10వ సీడ్, కరోలినా ముఛోవాను ఓడించి తొలిసారి ఒక గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను చేజిక్కించుకుంది. ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్లో నోస్కోవా 6-2, 5-7, 6-2తో ముఛోవాను చిత్తుచేసింది. తొలి సెట్‌ను సునాయాసంగా గెలిచిన నోస్కోవా.. రెండో సెట్‌లోనూ ఒక దశలో మ్యాచ్ పాయింట్ సాధించింది. ఆ దశలో ముఛోవా అనూహ్యంగా పుంజుకొని ఆ సెట్‌ను గెలుచుకోవడంతో నిర్ణయాత్మక మూడోసెట్ అనివార్యమైంది. మూడో సెట్‌లో నోస్కోవా తన అనుభవాన్ని ఉపయోగించి ముఛావాకు చెక్ పెట్టి టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఇద్దరు చెక్ క్రీడాకారిణుల మధ్య వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఫైనల్ జరగడం ఇదే తొలిసారి. ఇక ఆదివారం జరిగే పురుషుల సింగిల్స్ ఫైనల్లో టాప్‌సీడ్, ఇటలీకి చెందిన జెన్నిక్ సిన్నర్.. 2వ ర్యాంకర్, జర్మనీకి చెందిన అలెగ్జాండర్ జ్వెరేవ్‌తో తలపడనున్నాడు. ఈ ఏడాది జ్వెరేవ్ ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను చేజిక్కించుకున్న సంగతి తెలిసిందే.








కామెంట్‌లు (0)