న్యూఢిల్లీ : అమెరికా-ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు, హర్మూజ్ జలసంధి ద్వారా చమురు రవాణా అంతరాయం, ఎర్ర సముద్రంలో హౌతీల దాడులతో ఈ వారం అంతర్జాతీయ ముడిచమురు ధరలు దాదాపు 10 శాతం వరకు పెరిగాయి. అయితే అమెరికా-ఇరాన్ మధ్య నిలిచిపోయిన చర్చలను పునరుద్ధరించేందుకు చైనా ప్రయత్నాలు ప్రారంభించిందన్న వార్తలతో శుక్రవారం బ్రెంట్ క్రూడ్ ధర 3.9 శాతం పడిపోయి బ్యారెల్‌కు 96.78 డాలర్లకు, అమెరికా వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ (డబ్ల్యుటిఐ) 3.1 శాతం తగ్గి 89.31 డాలర్లకు చేరింది. అయినప్పటికీ వారాంతానికి బ్రెంట్ దాదాపు 10 శాతం, డబ్ల్యుటిఐ8.3 శాతం చొప్పున పెరిగాయి.
మధ్యప్రాచ్య ఉద్రిక్తతలు కొనసాగితే చమురు ధరలు మరింత పెరిగే ప్రమాదం ఉందని ప్రముఖ ఆర్థిక సంస్థలు హెచ్చరిస్తున్నాయి. సరఫరా అంతరాయం ప్రతి నెల కొనసాగితే బ్రెంట్ ధర బ్యారెల్‌కు మరో 7–8 డాలర్లు పెరిగే అవకాశం ఉందని జెపి మోర్గాన్ అంచనా వేయగా, హర్మూజ్ జలసంధిలో రవాణా సమస్యలు కొనసాగితే ధరలు 120 డాలర్ల వరకు చేరవచ్చని గోల్డ్‌మన్ శాక్స్ పేర్కొంది.








కామెంట్‌లు (0)