మంగళవారం, 21 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరల భారీ పెరుగుదల

1 రోజు క్రితం

crude
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 20, 2026, 05:00 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

- 90 డాలర్ల దాటిన బ్రెంట్ క్రూడ్

- ప్రపంచ దేశాల్లో ఆందోళన

లండన్: అమెరికా–ఇరాన్ మధ్య సైనిక ఘర్షణలు తీవ్రరూపం దాల్చడంతో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు భారీగా పెరిగాయి. సోమవారం ట్రేడింగ్‌లో బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 90.50 డాలర్లకు చేరుకుని, జూన్ మధ్యకాలం తర్వాత తొలిసారిగా 90 డాలర్ల మార్కును అధిగమించింది. ట్రేడింగ్ ప్రారంభ దశలో ధరలు ఒక దశలో 4 శాతం వరకు పెరిగాయి. హోర్ముజ్ జలసంధి ద్వారా ప్రపంచ చమురు సరఫరాకు అంతరాయం కలుగుతుందనే ఆందోళనలతో మార్కెట్లలో ఉద్రిక్తత నెలకొంది. బ్రెంట్ క్రూడ్ 2.7 శాతం పెరగగా, యూఎస్ వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ (WTI) ఆగస్టు డెలివరీ ధర 2.4 శాతం పెరిగి బ్యారెల్‌కు 84.49 డాలర్లకు చేరుకుంది.

వారాంతంలో అమెరికా, ఇరాన్‌ల మధ్య జరిగిన ప్రతిదాడులు, తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం కుప్పకూలిందని టెహ్రాన్ ప్రకటించడం చమురు మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపింది. దీంతో ప్రపంచ ఇంధన సరఫరా గొలుసుపై అనిశ్చితి మరింత పెరిగింది.

వాణిజ్య నౌకల భద్రత కోసం యూఎస్ సెంట్రల్ కమాండ్ వరుసగా తొమ్మిదవ రాత్రి కూడా ఇరాన్ లక్ష్యాలపై దాడులు కొనసాగించినట్లు తెలిపింది. మరోవైపు, తమ గగనతలంలోకి ప్రవేశించిన ఇరాన్ డ్రోన్‌లను కూల్చివేసినట్లు కువైట్ ప్రకటించింది. హోర్ముజ్ జలసంధిలో నౌకాయాన భద్రతపై ఆందోళనలు పెరుగుతున్నాయి. హెచ్చరికలను పట్టించుకోకుండా ప్రయాణించేందుకు ప్రయత్నించిన నాలుగు గుర్తుతెలియని నౌకలను అడ్డుకున్నట్లు ఇరాన్ నౌకాదళం వెల్లడించింది. వాటిలో రెండు నౌకలను నిలిపివేసి, మిగిలిన వాటిని వెనక్కి పంపినట్లు తెలిపింది.

ఇదిలా ఉండగా, ఒమన్ వాయువ్య సముద్ర ప్రాంతంలో ఓ నౌకకు మంటలు అంటుకున్నట్లు యూకే మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ వెల్లడించింది. సైనిక స్థావరాలు, వంతెనలు, ఓడరేవులు, ఇంధన మౌలిక సదుపాయాలపై దాడులు కొనసాగుతున్న నేపథ్యంలో ప్రాంతీయ ఉద్రిక్తతలు మరింత పెరుగుతున్నాయి.

శనివారం ఇరాన్ జరిపిన దాడిలో తమ చమురు ఉత్పత్తి కేంద్రాల్లో ఒకటి దెబ్బతిన్నట్లు కువైట్ పెట్రోలియం కార్పొరేషన్ ధృవీకరించింది. ఈ పరిణామాల నేపథ్యంలో అంతర్జాతీయ చమురు ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్