నాలుగు రోజుల పాటు ‘హిప్లెక్స్ 2026’ ఏర్పాటు
ప్రజాశక్తి - హైదరాబాద్ : దక్షిణాదిలోనే అతిపెద్ద ప్లాస్టిక్స్ ప్రదర్శన ‘హిప్లెక్స్ 2026’కు హైదరాబాద్ వేదిక కానుంది. హైటెక్స్‌లో ఏర్పాటు చేస్తోన్న నాలుగు రోజుల ఈ ప్రదర్శనను శుక్రవారం తెలంగాణ పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి డి శ్రీధర్ బాబు లాంచనంగా ప్రారంభించనున్నారు. తెలంగాణ అండ్ ఆంధ్ర ప్లాస్టిక్స్ మాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ (టాప్మా) ఆధ్వర్యంలో ఆగస్టు 7 నుంచి 10 వరకు ఏడు ఎగ్జిబిషన్ హాళ్లలో 26 వేల చదరపు మీటర్లకు పైగా విస్తీర్ణంలో ఈ అంతర్జాతీయ ప్రదర్శన జరగనుంది. బుధవారం హైదరాబాద్‌లోని ఎఫ్‌టిసిసిఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టాప్మా అధ్యక్షుడు నరేంద్ర బాల్ద్వా, హెప్లెక్స్ కన్వీనర్ మీలా జయదేవ్, ఎఐపిఎంఎ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అనిల్ రెడ్డి వెన్నం, టాప్‌మా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఎన్. భాస్కర్ రెడ్డి ప్రదర్శన వివరాలను వెల్లడించారు. హిప్లెక్స్ చరిత్రలోనే అతిపెద్దదైన ఈ ఎడిషన్‌లో 550 ఎగ్జిబిటర్లు, 50 వేలకు పైగా వ్యాపార సందర్శకులు పాల్గొననుండగా.. ప్రత్యేక రీసైక్లింగ్ పావిలియన్, అత్యాధునిక ప్లాస్టిక్ ఆవిష్కరణలు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయన్నారు. ఆగస్టు 6 వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకునే వారికి ప్రవేశం ఉచితం కాగా, ఆ తర్వాత రోజుల్లో ప్రవేశ రుసుము రోజుకు రూ.300 ఉంటుందన్నారు. భారత్‌లో తలసరి ప్లాస్టిక్ వినియోగం సుమారు 7 కిలోలు మాత్రమే ఉండగా.. చైనాలో అది 24 కిలోలు ఉందని, ఈ రంగంలో భారత్‌కు అపారమైన వృద్ధి అవకాశాలు ఉన్నాయని వారు చెప్పారు.








కామెంట్‌లు (0)