- ఇప్పటికే లక్ష్యంలో 40 శాతం ఖర్చు
న్యూఢిల్లీ : దేశ ఆర్థిక వ్యవస్థలో మందగమనం కొనసాగుతున్నప్పటికీ ప్రభుత్వ రంగ సంస్థలు తమ పెట్టుబడి వ్యయాలను కొనసాగిస్తున్నాయి. ప్రస్తుతం 2026-27 ఆర్థిక సంవత్సరానికి మూలధన లక్ష్యంలో ఇప్పటికే 40 శాతం వ్యయం చేశాయి. మొదటి ఐదు నెలల్లో రూ.3.36 లక్షల కోట్ల మూలధన వ్యయాన్ని నమోదు చేశాయి. గత ఏడాది ఇదే కాలంలో ఈ సంస్థలు రూ.2.72 లక్షల కోట్లు పెట్టుబడి పెట్టగా.. ఈ ఏడాది దాదాపు 23.5 శాతం పెరుగుదల నమోదయ్యింది. అయితే రుతుపవనాల ప్రభావం కారణంగా నెలవారీ మూలధన వ్యయాల్లో కొంత మందగమనం కనిపించింది. జులై నెలలో 35.2 శాతం బలమైన వృద్ధి నమోదు కాగా, ఆగస్టు నాటికి అది సుమారు 4.8 శాతానికి పడిపోయింది. అయినప్పటికీ ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ రంగ సంస్థల పెట్టుబడుల జోరు స్థిరంగా కొనసాగుతోందని తాజా గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. రైల్వే, ఎన్‌హెచ్‌ఎఐ సంస్థలు రూ.4.52 లక్షల కోట్ల మూలధనం వ్యయాలని చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఇది మొత్తం పిఎస్‌యుల పెట్టుబడుల లక్ష్యంలో 54 శాతం కావడం విశేషం. గడిచిన 2025-26లో ఈ సంస్థలు తమ రూ.7.85 లక్షల కోట్ల లక్ష్యానికి మించి ఏకంగా రూ.8.64 లక్షల కోట్లు పెట్టుబడి పెట్టాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ఈ లక్ష్యాన్ని రూ.8.43 లక్షల కోట్లకు నిర్ధారించుకున్నాయి. ఈ క్రమంలో మొదటి ఐదు నెలల్లోనే 40 శాతం లక్ష్యాన్ని చేరుకోవడం విశేషం.








కామెంట్‌లు (0)