శనివారం, 19 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఎంఎఫ్‌‌ల్లో తెలుగు రాష్ర్టాల రికార్డ్‌‌లు

16 గంటల క్రితం

business
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 18, 2026, 10:37 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

- రూ.2.95 లక్షల కోట్లకు ఎయుఎం

ప్రజాశక్తి - హైదరాబాద్‌ : మ్యూచువల్ ఫండ్ పెట్టుబడుల విషయంలో తెలుగు రాష్ట్రాలు నూతన రికార్డులను సృష్టిస్తున్నాయని అసోసియేషన్‌ ఆఫ్‌ ‌మ్యూచువల్‌ ‌ఫండ్స్‌ ఇన్‌ ఇండియా (అంఫీ) చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ‌వెంకట్‌ ఎన్‌ ‌చలసాని అన్నారు. శుక్రవారం హైదరాబాద్‌‌లో ఆయన మీడియా‌తో మాట్లాడుతూ.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు సంయుక్తంగా రూ. 2.95 లక్షల కోట్ల అసెట్‌ అండర్‌ ‌మేనేజ్‌‌మెంట్‌ (ఎయుఎం)ను కలిగి ఉన్నాయని తెలిపారు. దేశ వ్యాప్త ఎంఎఫ్‌ ఆస్తుల్లో ఇది కీలకమన్నారు. మార్కెట్ ఒడిదుడుకులతో సంబంధం లేకుండా క్రమశిక్షణతో కూడిన దీర్ఘకాలిక పెట్టుబడుల కోసం ప్రజలు సిప్ విధానాన్ని ఎక్కువగా ఎంచుకుంటున్నారని చెప్పారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎంఎఫ్‌ పెట్టుబడుల ఆకర్షణలో అద్భుతమైన ప్రతిభ కనబరుస్తోందన్నారు. జులై 2026 నాటికి ఎపిలో మొత్తం ఆస్తుల నిర్వహణ విలువ రూ.82,409 కోట్లకు చేరిందన్నారు. గత ఏడాది జులైతో పోలిస్తే ఇది 23 శాతం బలమైన వృద్ధిని కనబరిచిందన్నారు. దేశ మొత్తం మ్యూచువల్ ఫండ్ ఆస్తులలో ఎపి వాటా దాదాపు 1 శాతంగా ఉండగా, రాష్ట్రంలోని ఫోలియోల సంఖ్య 79.44 లక్షలకు పైగా నమోదయ్యిందన్నారు. ఎపిలో విశాఖపట్నం రూ.16,614 కోట్ల ఎయుఎంతో అగ్రస్థానంలో నిలవగా, విజయవాడ రూ. 8,337 కోట్ల ఎయుఎంతో తర్వాతి స్థానంలో ఉందన్నారు. ఎపిలో ఎంఎఫ్‌‌లపై అవగాహన పెంచడానికి 27 జిల్లాల్లో ఇద్దరు చొప్పున లెక్చరర్లను నియమించుకున్నామని చెప్పారు.

జులై 2026 నాటికి తెలంగాణ ఎంఎఫ్‌ ఎయుఎం రూ.2,12,856 కోట్లకు చేరిందన్నారు. గత ఏడాది ఇదే సమయంతో పోలిస్తే ఇది 19 శాతం వృద్ధిని నమోదు చేసిందన్నారు. తెలంగాణ రాష్ట్ర మొత్తం ఆస్తులలో హైదరాబాద్‌ ఏకంగా 87 శాతం (రూ. 1,84,261 కోట్లు) వాటాను కలిగి ఉందన్నారు. దేశంలోని టాప్ 30 నగరాల జాబితాలో హైదరాబాద్ 8వ స్థానంలో నిలిచిందన్నారు. దేశంలో 2014లో ఎంఎఫ్‌ ఎఎంసిల ఎయుఎం రూ.10 లక్షల కోట్లుగా ఉండగా.. ఇప్పుడు ఇది రూ.87 లక్షల కోట్లకు చేరిందన్నారు. వచ్చే నాలుగైదు నెలల్లో రూ.100 లక్షల కోట్లకు చేరొచ్చని అంచనా వేశారు. దేశంలో ప్రస్తుతం 57 ఎఎంసిలు ఉన్నాయని.. మరిన్ని సంస్థలు అనుమతుల కోసం ఎదురు చూస్తున్నాయని చెప్పారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్