పొద్దున్నే నిద్రలేవాలి... బ్రష్ చేయాలి... టిఫిన్ తినాలి... సమయానికి స్కూల్‌కు వెళ్లాలి... హోంవర్క్ పూర్తి చేయాలి... ఫోన్ ఎక్కువసేపు చూడకూడదు... రాత్రి త్వరగా పడుకోవాలి... ఇలా ప్రతి ఇంట్లో రోజూ వినిపించే మాటలే పిల్లలకు పెద్ద తలనొప్పిగా అనిపిస్తుంటాయి. ఒకటే మాట పదేపదే చెబుతుండటంతో విసుగు, చిరాకు, కొన్నిసార్లు మొండితనం కూడా పెరుగుతుంది. చాలామంది తల్లిదండ్రులు మాత్రం "మమ్మల్ని మా పెద్దలు ఇలాగే పెంచారు... ఇప్పుడు మేం కూడా అలాగే పెంచాలి" అనే భావనతో పిల్లల వెంట పడుతూనే ఉంటారు. కానీ కాలం మారింది. పిల్లల ఆలోచనా విధానం, ప్రశ్నించే స్వభావం, ప్రపంచాన్ని అర్థం చేసుకునే తీరు కూడా మారిపోయింది. అందుకే ఆదేశాలు, హెచ్చరికలు, శిక్షలతో క్రమశిక్షణ నేర్పే రోజులు దాదాపుగా ముగిశాయని మనస్తత్వ నిపుణులు చెబుతున్నారు. పిల్లలకు ఏ నియమమైనా పాటించమని చెప్పేముందు, అది ఎందుకు అవసరమో అర్థమయ్యేలా వివరించినప్పుడే వారు దాన్ని మనస్ఫూర్తిగా అంగీకరిస్తారని పరిశోధనలు సూచిస్తున్నాయి.
ప్రేమతో మార్పు
పిల్లలు ఒకసారి చెప్పగానే వినకపోవడం సహజం. అలాంటి సమయంలో కోపం, దండన, బెదిరింపులు ఆశ్రయించడం కంటే, ప్రేమగా మాట్లాడి వారి సందేహాలను తీర్చడం ఎంతో ప్రభావవంతమని మనస్తత్వవేత్తలు సూచిస్తున్నారు. కుటుంబ నియమాల వెనుక ఉన్న ఉద్దేశాన్ని పిల్లలకు వివరించడం, వారి ప్రశ్నలకు ఓపికగా సమాధానం చెప్పడం, చిన్నచిన్న నిర్ణయాల్లో వారికీ అవకాశం ఇవ్వడం వల్ల వారు ఆ నియమాలను తమ జీవితంలో భాగంగా స్వీకరిస్తారు. ప్రముఖ మనస్తత్వవేత్తలు ఎడ్వర్డ్ ఎల్. డెసి, రిచర్డ్ ఎం. ర్యాన్ ప్రతిపాదించిన స్వీయ నిర్ణయ సిద్ధాంతం కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తోంది. పిల్లలకు స్వయంగా ఆలోచించే అవకాశం, కుటుంబ సభ్యులతో ఆత్మీయ అనుబంధం, తమ వల్ల పనులు చేయగలమనే నమ్మకం లభించినప్పుడు వారు సహజంగానే బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తారు. శిక్ష భయంతో కాకుండా, తమ మంచికోసమే ఈ నియమాలని అర్థం చేసుకున్న పిల్లలు వాటిని స్వయంగా పాటించడం ప్రారంభిస్తారు. తల్లిదండ్రులు ప్రతి క్షణం గుర్తు చేయాల్సిన అవసరం కూడా తగ్గిపోతుంది. ప్రేమతో ఇచ్చే వివరణ పిల్లల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచడమే కాకుండా భావోద్వేగ నియంత్రణను కూడా బలోపేతం చేస్తుందని పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.
పిల్లల మాట
కుటుంబ నియమాలు పెద్దలు రూపొందించినా, వాటిని పాటించాల్సింది పిల్లలే. అందుకే పిల్లలు ఏమనుకుంటున్నారు, వారికి ఏం ఇబ్బందిగా అనిపిస్తోంది, ఏ నియమం ఎందుకు నచ్చడం లేదనే విషయాలను తెలుసుకోవడం కూడా అంతే అవసరం! పిల్లల మాట పూర్తిగా వినకుండా తమ అధికారాన్ని ప్రదర్శించడం వల్ల దూరం పెరుగుతుంది. అదే వారి భావాలను గౌరవించి, తమ నిర్ణయాల వెనుక ఉన్న ఉద్దేశాన్ని ప్రశాంతంగా వివరించినప్పుడు కుటుంబంలో పరస్పర నమ్మకం పెరుగుతుంది. తల్లిదండ్రులు తమను నియంత్రించడం కోసం కాకుండా, తమ శ్రేయస్సు కోసమే సూచనలు చేస్తున్నారని పిల్లలు అర్థం చేసుకుంటారు. అప్పుడు ఎదురుతిరగడం, మొండితనం వంటి ప్రవర్తనలు క్రమంగా తగ్గుతాయి. భయంతో పెరిగిన పిల్లలు అవకాశం దొరికితే నియమాలను అతిక్రమించే అవకాశం ఎక్కువగా ఉంటే, అవగాహనతో పెరిగిన పిల్లలు మాత్రం జీవితంలో ఎక్కడ ఉన్నా బాధ్యతాయుతంగా నిర్ణయాలు తీసుకుంటారు. అందుకే పిల్లలకు నియమాలు నేర్పడం కంటే, ఆ నియమాల వెనుక ఉన్న జీవిత పాఠాన్ని నేర్పడం తల్లిదండ్రుల అసలైన బాధ్యతగా నిపుణులు సూచిస్తున్నారు.








కామెంట్‌లు (0)