వడ్డీ రేట్లు పావు శాతం పెంపు
రుణగ్రహీతలపై ఇఎంఐల భారం
ముంబయి : ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బిఐ) రుణాలపై వడ్డీ రేట్లను పెంచింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బిఐ) ఇటీవల రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు పెంచిన నేపథ్యంలో ఎస్బిఐ కూడా రుణ వడ్డీ రేట్లను సవరించింది. ఎక్స్టర్నల్ బెంచ్మార్క్ ఆధారిత రుణ వడ్డీ రేటు (ఇబిఎల్ఆర్), రెపో అనుసంధానిత రుణ వడ్డీ రేటు (ఆర్ఎల్ఎల్ఆర్)లను 25 బేసిస్ పాయింట్ల (0.25 శాతం) చొప్పున పెంచింది. దీంతోపాటు వివిధ కాలపరిమితులకు సంబంధించిన మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ ఆధారిత రుణ వడ్డీ రేట్లను (ఎంసిఎల్ఆర్) 15 బేసిస్ పాయింట్ల మేర సవరించింది. కొత్త రేట్లు అక్టోబర్ 15 నుంచి అమల్లోకి వచ్చాయి. ఈ నిర్ణయంతో ముఖ్యంగా ఫ్లోటింగ్ వడ్డీ రేట్లకు అనుసంధానమైన గృహ, వ్యక్తిగత, వాహన రుణాలపై నెలవారీ వాయిదాలు (ఇఎంఐ) పెరిగే అవకాశం ఉంది. తాజా సవరణ ప్రకారం ఇబిఎల్ఆర్ రేటు 7.90 శాతం నుంచి 8.15 శాతానికి పెరిగింది. రెపో అనుసంధానిత రుణ వడ్డీ రేటు 7.50 శాతం నుంచి 7.75 శాతానికి చేరింది. మరోవైపు బెంచ్మార్క్ ప్రైమ్ లెండింగ్ రేటు (బిపిఎల్ఆర్) వార్షికంగా 14.65 శాతం వద్ద కొనసాగుతోంది. ఈ పరిణామంతో రుణ ఒప్పందంలోని నిబంధనలను బట్టి నెలవారీ ఇఎంఐ పెరగడం లేదా రుణ చెల్లింపు కాలపరిమితి పొడిగించడం జరగవచ్చు.








కామెంట్లు (0)