- జపాన్ ఓపెన్ సూపర్-750 టైటిల్ సాధించిన తొలి షట్లర్‌గా రికార్డు
టోక్యో: భారత షట్లర్ పివి సింధు చరిత్ర సృష్టించింది. జపాన్ ఓపెన్ టైటిల్ గెలిచిన తొలి భారత షట్లర్‌గా రికార్డు నెలకొల్పింది. ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో సింధు.. వరుససెట్లలో ప్రపంచ ఛాంపియన్, జపాన్ కు చెందిన 3వ ర్యాంకర్ యమగుచిని వరుససెట్లలో ఓడించి తొలిసారి ఈ టైటిల్‌ను గెలుచుకుంది. హోరాహోరీగా సాగిన తుదిపోరులో సింధు 21-17, 21-17 తేడాతో యమగుచిపై విజయం సాధించింది. తొలి గేమ్ ప్రారంభం నుంచే దూకుడుగా ఆడిన సింధు.. క్రాస్‌కోర్ట్ డ్రాప్స్, శక్తివంతమైన స్మాష్‌తో యమగుచిపై ఒత్తిడి పెంచింది. ఈ క్రమంలో 17-17తో సమానంగా నిలిచిన దశలో సింధు పూర్వ అనుభవాన్ని ఉపయోగించి వరుసగా 4 పాయింట్లు సాధించి గేమ్‌ను కైవసం చేసుకుంది. అదే ఉత్సాహంతో రెండో గేమ్‌లోనూ సింధు మరింత దూకుడుగా ఆడింది. యమగుచి సంధించిన నెట్ గేమ్‌ను సమర్థంగా ఎదుర్కొంటూ.. 21-17తో ఆ గేమ్‌ను ముగించి టైటిల్‌ను సొంతం చేసుకుంది. దీంతో 2024లో సయ్యద్ మోదీ ఇంటర్నేషనల్ గెలిచిన తర్వాత సింధుకు ఇదే తొలి అంతర్జాతీయ టైటిల్. పురుషుల సింగిల్స్ టైటిల్‌ను ఫ్రాన్స్‌కు చెందిన 5వ ర్యాంకర్ పొపోవ్ కైవసం చేసుకున్నాడు. ఫైనల్లో పొపోవ్ 21-11, 21-19తో జపాన్‌కు చెందిన వాటనాబేను ఓడించాడు.
ఏడేళ్ల తర్వాత తొలి టైటిల్
సింధు కెరీర్‌లో ఇది సరికొత్త మైలురాయిగా నిలిచిపోనుంది. ఫామ్‌పై పలు విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఈ టైటిల్‌తో సింధు వారందరీకి కళ్లెం వేసింది. 2024 డిసెంబర్‌లో సయ్యద్ మోదీ టోర్నీ గెలిచిన తర్వాత దాదాపు రెండేళ్ల అనంతరం సింధు అందుకున్న తొలి బిడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ టైటిల్ ఇది. సూపర్-750 లేదా అంతకంటే పెద్ద టోర్నీల్లో సింధు టైటిల్ సాధించడం ఏడేళ్లలో ఇదే తొలిసారి. సింధు ప్రపంచ 5వ ర్యాంకర్ హాన్ యూయే, టోక్యో ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత చెన్ యూఫీ వంటి దిగ్గజ షట్లర్లను చిత్తుచేసింది. ఈ టైటిల్ కైవసం చేసుకోవడంతో ర్యాంకింగ్స్‌లోనూ సింధు పైకి ఎగబాకనుంది.
ప్రధాని, ముఖ్యమంత్రి అభినందనలు
జపాన్ ఓపెన్ సూపర్-750 టైటిల్‌ను కైవసం చేసుకున్న ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పివి సింధుకు ప్రధాని నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. భారత బ్యాడ్మింటన్‌లో చారిత్రాత్మక ఘట్టాన్ని నమోదు చేశారని, రాబోయే టోర్నీలు, ఒలింపిక్స్‌లోనూ విజయం సాధించాలని ఆకాంక్షించారు. ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్, క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రామ్‌ప్రసాద్ రెడ్డి, మంత్రులు నారా లోకేష్, బిసి జనార్థన్ రెడ్డి తదితరులు సింధుకు ట్విటర్ వేదికగా అభినందనలు తెలిపారు.








కామెంట్‌లు (0)