- పొంచిఉన్న నిధుల కొరత ముప్పు..
- కేర్ ఎడ్జ్ రిపోర్ట్
న్యూఢిల్లీ: దేశీయ బ్యాంకింగ్ రంగంలో రుణ వృద్ధి వేగంగా పెరుగుతుండగా, డిపాజిట్ల సమీకరణ మాత్రం మందగిస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో బ్యాంకుల రుణ వృద్ధి 16.5 శాతానికి చేరిందని కేర్ ఎడ్జ్ ఓ రిపోర్ట్‌లో వెల్లడించింది. గత ఎనిమిది త్రైమాసికాల్లో ఇదే అత్యధికమని తెలిపింది. ఇదే సమయంలో డిపాజిట్ల వృద్ధి 11.3 శాతానికే పరిమితమైంది. దీంతో రుణాలు-డిపాజిట్ల వృద్ధి మధ్య అంతరం 512 బేసిస్ పాయింట్లకు చేరింది. కేర్ ఎడ్జ్ నివేదిక ప్రకారం.. 2026 జూన్ 30 నాటికి దేశీయ బ్యాంకుల మొత్తం రుణాలు రూ.213.6 లక్షల కోట్లకు, డిపాజిట్లు రూ.256.5 లక్షల కోట్లకు చేరాయి. రుణాల వేగవంతమైన వృద్ధి కారణంగా బ్యాంకింగ్ వ్యవస్థలో లోన్-టు-డిపాజిట్ రేషియో (ఎల్‌డిఆర్) 83.3 శాతానికి పెరిగింది. సాధారణంగా జూన్ త్రైమాసికంలో ఈ నిష్పత్తి పెద్దగా పెరగకపోయినా.. ఈసారి రికార్డు స్థాయికి చేరడం బ్యాంకులపై నిధుల సమీకరణ ఒత్తిడి పెరుగుతున్న సంకేతంగా నిపుణులు భావిస్తున్నారు.
ఎన్‌బిఎఫ్‌సిలకు భారీగా రుణాలు
రుణ వృద్ధిలో నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలకు ఇచ్చిన రుణాలు కీలకంగా నిలిచాయి. అధిక బాండ్ రాబడుల కారణంగా ఎన్‌బిఎఫ్‌సిలు, పెద్ద కార్పొరేట్ సంస్థలు బాండ్ మార్కెట్‌కు బదులుగా బ్యాంకుల నుంచి నిధులు సమీకరించాయి. దీంతో ఎన్‌బిఎఫ్‌సిలకు బ్యాంకు రుణాలు 22.4 శాతం పెరిగి రూ.25.3 లక్షల కోట్లకు చేరాయి. పరిశ్రమలకు ఇచ్చిన రుణాలు 15.5 శాతం, వ్యక్తిగత రుణాలు 12.7 శాతం వృద్ధి చెందాయి. అయితే ఈ రుణాల్లో కొత్త పెట్టుబడుల కంటే మూలధన పెట్టుబడులు, రోజువారీ నిర్వహణ అవసరాల వాటా ఎక్కువగా ఉన్నట్లు నివేదిక సూచిస్తోంది.
అసలు సవాల్..
ప్రభుత్వ రంగ బ్యాంకుల రుణ వృద్ధి 17.3 శాతంగా ఉండగా.. ప్రయివేటు బ్యాంకుల్లో ఇది 14.8 శాతంగా నమోదైంది. అయితే ప్రభుత్వ రంగ బ్యాంకుల ఎల్‌డిఆర్ కూడా 79 శాతానికి చేరుకోవడంతో భవిష్యత్తులో రుణ విస్తరణకు అందుబాటులో ఉండే నిధులపై ఒత్తిడి పెరగవచ్చు. ఆర్‌బిఐ కల్పించిన ఎఫ్‌సిఎన్‌ఆర్-బి స్వాప్ సదుపాయం ద్వారా కొంత విదేశీ నిధులు అందడంతో తాత్కాలికంగా ఊరట లభించినప్పటికీ.. స్థిరమైన రుణ వృద్ధికి డిపాజిట్ల సమీకరణే ప్రధాన సవాల్‌గా మారనుంది. గృహ పొదుపులకు ప్రత్యామ్నాయ పెట్టుబడి మార్గాలు పెరుగుతున్న నేపథ్యంలో బ్యాంకులు డిపాజిట్లను ఆకర్షించేందుకు మరింత పోటీ పడాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.








కామెంట్‌లు (0)