- దేశంలో జులైలో రూ.2.11 లక్షల కోట్ల కలెక్షన్
- మేక్ ఇన్ ఇండియాకు సవాళ్లు
న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్ జిఎస్‌టి వసూళ్లలో తగ్గుదల నమోదు కాగా.. మరోవైపు దేశ వ్యాప్తంగా దిగుమతి ఉత్పత్తుల పన్నులతో జిఎస్‌టి వసూళ్లు మెరుపు మెరిశాయి. ఈ ఏడాది జులై నెలలో వస్తు సేవల పన్ను (జిఎస్‌టి) రాబడి రికార్డు స్థాయిలో రూ.2.11 లక్షల కోట్లకు చేరాయి. గతేడాదితో ఇదే నెలతో పోల్చితే మొత్తం జిఎస్‌టి వసూళ్లు 15.4 శాతం పెరిగియి. దేశీయ లావాదేవీల వృద్ధి కేవలం 10.1 శాతంగా ఉండగా.. మరోవైపు దిగుమతులపై వసూలైన జిఎస్‌టి ఏకంగా 28.8 శాతం పెరగడంతో ప్రభుత్వ ఆదాయం విదేశీ వస్తువులపైనే ఎక్కువగా ఆధారపడుతోందని స్పష్టం చేస్తోంది.
తెలుగు రాష్ర్టాల్లో భిన్నమైన పరిస్థితి నమోదయ్యింది. ఆంధ్రపదేశ్ జిఎస్‌టి వసూళ్లలో తగ్గుదల చోటు చేసుకోగా.. తెలంగాణలో రెండంకెల వృద్ధి చోటు చేసుకుంది. ఎపిలో గడిచిన జులైలో 5 శాతం పతనంతో రూ.3,366 కోట్ల జిఎస్‌టి వసూళ్లయ్యింది. గతేడాది ఇదే నెలలో రూ.3,532 కోట్ల పన్ను వసూళ్లు జరిగాయి. తెలంగాణలో గడిచిన జులైలో రూ.5,819 కోట్ల జిఎస్‌టి వసూళ్లయ్యింది. గతేడాది ఇదే నెలలోని రూ.4,871 కోట్ల పన్ను వసూళ్లతో పోల్చితే 19 శాతం వృద్ధి చోటు చేసుకుంది.
ముడి చమురు, పారిశ్రామిక ముడిసరుకులు, ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు వంటి వస్తువుల దిగుమతులు పెరగడంతో దేశీయంగా జిఎస్‌టి వసూళ్లకు మద్దతు లభించిందని ఆర్థిక శాఖ వర్గాలు తెలిపాయి. రూపాయి బలహీనపడటం వల్ల దిగుమతి వస్తువుల విలువ పెరగడంతో వాటిపై జిఎస్‌టి వసూళ్లు కూడా భారీగా పెరిగాయి. దీంతో విదేశాల నుంచి వస్తువులు కొనుగోలు చేయడంతోనే పన్నులు రాబడిలో పెరుగుదల చోటు చేసుకుందని ఆర్థిక శాఖ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఇది దేశీయ తయారీ రంగానికి హెచ్చరికగా కనిపిస్తోందని నిపుణులు విమర్శిస్తున్నారు. మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్, పిఎల్‌ఐ వంటి ప్రోత్సాహాకాలు అమల్లో ఉన్నప్పటికీ, పారిశ్రామిక అవసరాలకు ఇంకా దిగుమతులపైనే ఆధారపడాల్సి వస్తోంది. దిగుమతులు పెరిగితే ప్రభుత్వానికి తాత్కాలికంగా ఎక్కువ పన్ను ఆదాయం వచ్చిన్నప్పటికీ అదే సమయంలో వాణిజ్య లోటు పెరగడం, విదేశీ మారకద్రవ్యంపై ఒత్తిడి, దేశీయ పరిశ్రమల పోటీతత్వం తగ్గే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ పరిణామంతో ఆర్థిక వ్యవస్థలోని సవాళ్లను అంచనా వేయాల్సిన అవసరం ఉందని భావిస్తున్నారు. దేశీయ తయారీ, ఎగుమతులు, పెట్టుబడులు సమానంగా పెరిగితేనే ఈ వృద్ధి నిలకడగా కొనసాగుతుందని వారు అభిప్రాయపడుతున్నారు.
‘రికార్డు జిఎస్‌టి వసూళ్లను విజయంగా ప్రచారం చేయడం ఒక్కటే సరిపోదు. ఆ వసూళ్లు ఎక్కడి నుంచి వస్తున్నాయన్నదే అసలు ప్రశ్న. దిగుమతులపైనే ప్రభుత్వ ఆదాయం వేగంగా పెరుగుతుండటం, స్వదేశీ తయారీ ఇంకా ఆశించిన స్థాయిలో బలపడలేదనే సంకేతంగా భావించాల్సి ఉంటుంది. అందుకే రానున్న రోజుల్లో జిఎస్‌టి సంస్కరణలతో పాటు దేశీయ ఉత్పత్తి, తయారీ, దిగుమతి ప్రత్యామ్నాయ విధానాలకు ప్రభుత్వం మరింత ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉంది.’ అని నిపుణులు సూచిస్తున్నారు.








కామెంట్‌లు (0)