ఐదుగురు సభ్యుల ఏర్పాటుపై తీవ్ర అభ్యంతరం
న్యూఢిల్లీ : విత్త సంస్థలకు వేల కోట్ల రుణాలు ఎగ్గొట్టిన జీ గ్రూప్ వ్యవస్థాపకులు సుభాష్ చంద్ర న్యాయస్థానలపైనే ఎదురుదాడికి దిగుతున్నారు. చంద్ర వ్యక్తిగత దివాళా కేసుకు సంబంధించి నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్ ఐదుగురు సభ్యులతో ప్రత్యేక బెంచ్‌ను ఏర్పాటు చేయడంపై ఆయన తరపు న్యాయవాదులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ట్రిబ్యునల్‌కు ఐదుగురు సభ్యుల బెంచ్‌ను ఏర్పాటు చేసే చట్టపరమైన అధికారం ఎవరిచ్చారంటూ నేషనల్ కంపెనీ లా అప్పీలేట్ ట్రిబ్యునల్ (ఎన్‌సిఎల్‌ఎటి) ఎదుట ఎదురుదాడికి దిగారు. సుభాష్ చంద్ర తరఫున సీనియర్ అడ్వకేట్ సస్మిత్ పాత్ర ఎన్‌క్లాట్‌లో వాదనలు వినిపిస్తూ.. ఎన్‌సిఎల్‌టి తీసుకున్న ఈ నిర్ణయం పూర్తిగా చట్టవిరుద్ధమని స్పష్టం చేశారు. గ్రూప్ రుణాలకు సంబంధించి సుమారు రూ. 22,006 కోట్ల క్లెయిమ్‌లు ఉండగా.. కేవలం రూ. 6.5 కోట్ల వ్యక్తిగత గ్యారెంటీలను పరిష్కరించుకునేందుకు అనుమతించే మూడో సభ్యుడి ఉత్తర్వులపై ఈ ఐదుగురు సభ్యుల బెంచ్ స్టే విధించడంపై ఆయన అభ్యంతరం వ్యక్తంచేశారు. ఏ అధికారంతో ఈ బెంచ్ ఏర్పడింది, ఎలాంటి ప్రొసీడింగ్స్ నిర్వహించారంటూ ప్రశ్నించారు. ఈ కేసుకు సంబంధించి భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయని, అందువల్ల ఈ అంశాన్ని లోతుగా పరిశీలించడానికి విస్తృత బెంచ్ ఏర్పాటు చేయడం సరైనదేనని రుణదాతల తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదించారు. అయితే.. కంపెనీ చట్టం సెక్షన్ 419 ప్రకారం భిన్నాభిప్రాయాలు వస్తే వేరే సభ్యుడికి పంపాలే తప్ప, ఐదుగురు సభ్యుల బెంచ్‌ను ఏర్పాటు చేయడానికి ఎన్‌సిఎల్‌టి చట్టం ప్రకారం ఎటువంటి అధికారం లేదని సుభాష్ చంద్ర తరపు న్యాయవాది పునరుద్ఘాటించారు. ఈ వివాదంపై దాఖలైన అప్పీళ్లను తదుపరి విచారణ నిమిత్తం అక్టోబర్ 7కి ఎన్‌క్లాట్ ధర్మాసనం వాయిదా వేసింది.








కామెంట్‌లు (0)