శనివారం, 01 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

ఎండలతో ముప్పు

5 గంటల క్రితం

world
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 01, 2026, 09:00 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

- ఆర్థిక వ్యవస్థకు హెచ్చరిక

- దక్షిణాసియా ఆర్థిక వ్యవస్థకు 7 శాతం నష్టం..

- ప్రపంచ బ్యాంక్‌ రిపోర్ట్‌‌లో వెల్లడి

న్యూఢిల్లీ : దేశ వ్యాప్తంగా పెరుగుతున్న ఎండలు దేశ ఆర్థిక వ్యవస్థకు పెను ముప్పుగా మారే అవకాశం ఉందని ప్రపంచ బ్యాంకు హెచ్చరించింది. తాజాగా రూపొందించిన ‘ఏ లివబుల్ ఫ్యూచర్: ప్రొటెక్టింగ్ జాబ్స్ అండ్ గ్రోత్ ఫ్రమ్ ఎక్స్‌ట్రీమ్ హీట్ ఇన్ సౌత్ ఏషియా’ నివేదికలో ఈ విషయాన్ని బ్యాంకు ప్రత్యేకంగా ప్రస్తావించింది. ఉష్ణోగ్రతల్లో చోటుచేసుకుంటున్న భారీ మార్పుల కారణంగా 2050 నాటికి దక్షిణాసియా ఆర్థిక వ్యవస్థ దాదాపు 7శాతం కుచించుకుపోయే అవకాశం ఉందని ఈ నివేదికలో పేర్కొన్న ప్రపంచ బ్యాకు భారతదేశంలో చోటుచేసుకునే పరిణామాలను ప్రత్యేకంగా ప్రస్తావించింది. తీవ్రమైన వేడి కారణంగా బహిరంగ ప్రదేశాల్లో పని గంటలు తగ్గిపోవడం వల్ల ఉత్పాదకత దెబ్బతిని, ఉపాధి అవకాశాలు కూడా భారీగా తగ్గుతాయని పేర్కొంది. ​2030 నాటికి ఢిల్లీలో 2.66 లక్షల పూర్తి స్థాయి ఉద్యోగాలు, ముంబయిలో 2 లక్షలకు పైగా, కోల్‌కతాలో 3.6 లక్షల ఉద్యోగాలు ప్రమాదంలో పడనున్నాయని తెలిపింది. 2050, 2080 నాటికి ఈ సంఖ్యలు మరింత పెరుగుతాయని పేర్కొంది. ఇప్పటికే 2024లో తీవ్ర ఉష్ణోగ్రతల కారణంగా భారత్ 24,700 కోట్ల కార్మిక గంటలను, 194 బిలియన్ డాలర్ల విలువ చేసే ఆదాయాన్ని ఇప్పటికే కోల్పోయిందని నివేదికలో తెలిపింది. వాతావరణ మార్పుల ప్రభావం ఉపాధికే పరిమితం కాదని, ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం వంటి కీలక మౌలిక సదుపాయాలు 2030 నుంచే 50 డిగ్రీల సెల్సియస్‌కు చేరువైన ఉష్ణోగ్రతలను ఎదుర్కొనే అవకాశం ఉందని పేర్కొంది. దీంతో విమానాల బరువు, ఇంధన వినియోగం, రవాణా వ్యయం పెరిగే ప్రమాదం ఉంది. అదే సమయంలో ఉష్ణోగ్రతల పెరుగుదల నిర్మాణం, వ్యవసాయం, తయారీ వంటి శ్రమాధారిత రంగాలపై ప్రత్యక్ష ప్రభావం చూపి ఆర్థిక వృద్ధి మరింత మందగించే అవకాశం ఉందని హెచ్చరించింది. వీటిని దృష్టిలో ఉంచుకుని వాతావరణ మార్పులను ఎదుర్కొనే చర్యలను వేగవంతం చేయాలని ప్రభుత్వాలకు సూచించింది.​

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్