మంగళవారం, 07 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

ఆగ‌స్టు 1 నుంచి మార్కెట్లోకి ‘స్వ‌యం ఎపి’

1 గంట క్రితం

kondapalli srinivas
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 07, 2026, 10:14 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

- మంత్రి కొండ‌ప‌ల్లి శ్రీనివాస్‌

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలోని మహిళా స్వయం సహాయక సంఘాలు తయారు చేసే నాణ్యమైన ఉత్పత్తులకు స్వ‌యం ఎపి బ్రాండ్ ద్వారా రాష్ట్రస్థాయి గుర్తింపు కల్పించి, విస్తృత మార్కెట్‌ను అందించేందుకు కృషి చేస్తున్న‌ట్టు ఎంఎస్‌ఎంఇ, గ్రామీణ పేదరిక నిర్మూలన శాఖల మంత్రి కొండ‌ప‌ల్లి శ్రీనివాస్ తెలిపారు. విజ‌య‌వాడ‌లోని సెర్ప్ ప్ర‌ధాన కార్యాల‌యంలో మంగ‌ళ‌వారం జ‌రిగిన స‌మీక్షా స‌మావేశంలో మంత్రి మాట్లాడుతూ.. అన్ని జిల్లాల నుంచి ఆయా ప్రాంతాల సంప్ర‌దాయాల‌ను ప్ర‌తిబింబించేలా 65 ప్రత్యేక ఉత్పత్తులను సెర్ప్ గుర్తించింద‌ని, 587 మహిళా సంఘాల ఆధ్వ‌ర్యంలో త‌యారవుతోన్న ఈ ఉత్ప‌త్తుల‌ను ఆగ‌స్టు 1 నుంచి మార్కెట్లోకి తీసుకువ‌స్తున్న‌ట్టు మంత్రి ప్ర‌క‌టించారు. ఈ ఉత్పత్తుల నిల్వ, ఆర్డర్ల నిర్వ‌హ‌ణ‌, వేగవంతమైన స‌ర‌ఫ‌రా కోసం రెండు ఆర్డర్ల ప్రాసెసింగ్‌ ‌కేంద్రాలను ప్రారంభిస్తామ‌న్నారు. విజ‌య‌వాడ‌లో బాపూజీ మ్యూజియం ద‌గ్గ‌ర, గొల్ల‌పూడిలోని టిటిడిసి ప్రాంగ‌ణంలో రెండు సిగ్నేచ‌ర్ స్టోర్లు ఏర్పాటు చేస్తున్న‌ట్టు మంత్రి తెలిపారు. ఉత్ప‌త్తులు అన్నీ నాణ్య‌తా ప్ర‌మాణాల మేర‌కు ఉండేలా చూస్తున్నామ‌ని, ఈ విష‌యంలో మ‌హిళా సంఘాల‌కు పూర్తి శిక్ష‌ణ ఇస్తున్నట్టు తెలిపారు. ఈ కార్య‌క్ర‌మంలో గ్రామీణ మ‌హిళా ఉత్ప‌త్తుల‌కు స్థిర‌మైన మార్కెట్ సౌక‌ర్యం క‌ల్పించ‌డం ద్వారా వారి ఆదాయం పెంచ‌డంతో పాటు స్వ‌యం ఎపి బ్రాండ్‌ను మరింత‌గా అభివృద్ధి చేయాల‌న్న ముఖ్య‌మంత్రి ల‌క్ష్యానికి అనుగుణంగా ప‌ని చేస్తున్న‌ట్టు పేర్కొన్నారు. కొత్త‌గా ఏర్పాట‌య్యే పారిశ్రామిక సంస్థ‌ల స‌మ‌ర్థ‌వంత ప‌నితీరుకోసం ప్ర‌తి నెలా సామాజిక త‌నిఖీలు నిర్వ‌హిస్తామ‌న్నారు. ఎస్‌హెచ్‌జీ మ‌హిళ‌ల ద్వారా ఆధునిక యాంత్రిక‌, లాండ్రీ యూనిట్ల ఏర్పాటుకు చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని సెర్ప్ అధికారుల‌కు మంత్రి సూచించారు. ఎస్‌హెచ్‌జీ మహిళలకు వివాహ సంబంధిత అవసరాల కోసం తక్కువ వడ్డీతో, సులభంగా రుణం అందించేందుకు స్త్రీ నిధి ‘కళ్యాణ లక్ష్మి’ ప‌థ‌కం ప్రారంభించేందుకు చ‌ర్య‌లు తీసుకోవాల‌న్నారు. అలాగే ఎస్‌హెచ్‌జీ మహిళలంద‌రిని ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, ప్రధానమంత్రి సురక్షా బీమా యోజన పథకాలలో 100 శాతం నమోదు చేసి జీవిత, ప్రమాద బీమా రక్షణ కల్పించాల‌ని ఆదేశాలు జారీ చేశారు. వెలుగు మార్ట్‌లు ప‌నితీరు నిరంత‌రం ప‌ర్య‌వేక్షించ‌డంతో పాటు న‌ష్టాల‌తో మూత‌ప‌డిన, స‌రిగా ప‌నిచేయ‌ని మార్ట్‌ల విష‌యంలో బాధ్యుల‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌న్నారు. ఈ కార్య‌క్ర‌మంలో సెర్ప్ కార్యదర్శి వాకాటి క‌రుణ‌, డైరెక్ట‌ర్లు, మార్కెటింగ్ సిబ్బంది, స్వ‌యం ఏపీ బ్రాండ్ క‌న్స‌ల్టెంట్లు, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్