ఈ రోజుల్లో చాలామంది ఊబకాయంతో బాధపడుతున్నారు. బరువు తగ్గాలనే ఉద్దేశంతో కొందరు వైద్యులను సంప్రదించకుండా, మార్కెట్‌లో దొరికే ఇంజెక్షన్లు, ఇతర మందులను ఆశ్రయిస్తున్నారు. ఇలా చేయడం వల్ల అనవసరమైన కొవ్వుతోపాటు శరీరానికి అత్యంత అవసరమైన కండర ద్రవ్యరాశి కూడా తగ్గిపోయి ఆరోగ్యానికి ముప్పు వాటిల్లే అవకాశం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. తాజాగా 'ది లాన్సెట్ డయాబెటిస్ అండ్ ఎండోక్రినాలజీ'లో ప్రచురితమైన అధ్యయనం కూడా ఇదే విషయాన్ని వెల్లడించింది.
కండరాలపై ప్రభావం
ఊబకాయం చికిత్సలో భాగంగా ఆకలిని నియంత్రించి, కడుపు నిండిన భావన కలిగించే పేగు హార్మోన్ల ఆధారిత మందులను కొందరికి సూచిస్తారు. వీటి ప్రభావంతో చాలామంది బరువు తగ్గినా, అది శాశ్వత ఫలితం కాదని పరిశోధకులు పేర్కొంటున్నారు. ఈ మందుల వల్ల శరీరంలోని కొవ్వు 24 నుంచి 30 శాతం వరకు తగ్గినప్పటికీ, ఎముకలకు బలం అందించే కండర ద్రవ్యరాశి కూడా తగ్గే ప్రమాదం ఉందని కింగ్స్ కాలేజ్ లండన్‌కు చెందిన డాక్టర్ లారెన్స్ డోబీ నేతృత్వంలోని 26 మంది నిపుణులు గుర్తించారు. శరీర కదలికలు, జీవక్రియ, రక్తప్రసరణ సక్రమంగా సాగడానికి కండర వ్యవస్థ కీలకం. అందువల్ల ఈ ద్రవ్యరాశి తగ్గితే శారీరక సామర్థ్యం దెబ్బతింటుందని వారు హెచ్చరిస్తున్నారు.
ఆహారమే సరైన మార్గం
శరీర బరువును నియంత్రించాలంటే సమతుల ఆహారం, క్రమబద్ధమైన జీవనశైలినే అనుసరించాలని నిపుణులు సూచిస్తున్నారు. తగ్గిన ప్రతి నాలుగు కిలోల బరువులో కనీసం మూడు కిలోలు కొవ్వు నుంచే తగ్గాలి. ఒక కిలోకు మించకుండా మాత్రమే కండరాలు, ఇతర కొవ్వు రహిత కణజాలం తగ్గేలా జాగ్రత్తపడాలి. ఇందుకోసం తగినంత ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాలు, పీచు పదార్థాలు, ద్రవాలు ఉండే ఆహారాన్ని డైటీషియన్ సలహా మేరకు తీసుకోవాలి. ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను దీర్ఘకాలం కొనసాగించినప్పుడే ఆశించిన ఫలితాలు సాధ్యమవుతాయని అధ్యయనం స్పష్టం చేసింది.
వ్యాయామం ముఖ్యం!
ఆహార నియమాలతో పాటు ఏరోబిక్ వ్యాయామాలు, రెసిస్టెన్స్ బ్యాండ్ వ్యాయామాలు, బరువులు ఎత్తే వ్యాయామాలను క్రమం తప్పకుండా చేయడం అవసరం. అవసరమైనప్పుడు కండరాల బలం, శరీర నిర్మాణానికి సంబంధించిన పరీక్షలు చేయించుకోవడం కూడా మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. మందుల ప్రభావంతో త్వరగా సన్నబడిపోయామని భావించడం సరైంది కాదని, అలాంటి చికిత్సలు మానసిక ఆరోగ్యంపైనా ప్రభావం చూపే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.








కామెంట్‌లు (0)