- ఇల్లు, కారు కొనాలనుకునేవారికి షాక్..
న్యూఢిల్లీ: ఇల్లు, కారు లేదా వ్యక్తిగత రుణం తీసుకోవాలనుకునే వారికి బ్యాంకులు ఇచ్చే రుణాలు మరింత ఖరీదయ్యే అవకాశం ఉంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు పెంచి 5.50 శాతానికి చేర్చింది. దీంతో బ్యాంకుల రుణాలపై వడ్డీ రేట్లు పెరిగే అవకాశం ఉండటంతో, రుణగ్రహీతలపై నెలవారీ ఈఎంఐ భారం పెరగనుంది. మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరుగుతున్నాయి. దీంతో దేశంలో ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేందుకు ఆర్‌బీఐ వడ్డీ రేటును పెంచినట్లు స్పష్టం చేసింది. ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడానికి ఆర్‌బిఐ బ్యాంకులకు ఇచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీ రేటే రెపో రేటు. రెపో రేటు పెరిగితే, వాణిజ్య బ్యాంకులు ఆ భారాన్ని రుణగ్రహీతలపై మోపుతాయి. అంటే, బ్యాంకులు గృహ, వాహన, వ్యక్తిగత మరియు వాణిజ్య రుణాలపై వడ్డీ రేట్లను పెంచుతాయి.
ఉదాహరణకు 20 ఏళ్ల కాలానికి రూ.50 లక్షల గృహ రుణం తీసుకున్న వ్యక్తికి వడ్డీ రేటు పెరిగితే నెలవారీ ఈఎంఐ రూ.43 వేల నుంచి రూ.44 వేలకుపైగా పెరిగే అవకాశం ఉంటుంది. రుణ కాలపరిమితి, బ్యాంకు వడ్డీ రేటు, రుణగ్రహీతకు వర్తించే నిబంధనలను బట్టి అసలు మొత్తం మారుతుంది. ఈఎంఐ పెంచుకోవడం లేదా రుణ కాలపరిమితిని పొడిగించుకోవడం వంటి మార్గాలను రుణగ్రహీతలు ఎంచుకోవాల్సి రావచ్చు.
కారు రుణాలపైనా ప్రభావం పడే అవకాశం ఉంది. ఉదాహరణకు రూ.10 లక్షల కార్ లోన్‌ను ఐదేళ్ల కాలానికి 9 శాతం వడ్డీతో తీసుకుంటే ఈఎంఐ సుమారు రూ.20,758గా ఉంటుంది. వడ్డీ రేటు 9.25 శాతానికి పెరిగితే ఈఎంఐ సుమారు రూ.20,880కు చేరవచ్చు.
వ్యక్తిగత రుణాలు తీసుకునేవారిపైనా వడ్డీ భారం పెరగవచ్చు. రూ.5 లక్షల వ్యక్తిగత రుణంపై వడ్డీ రేటు 11 శాతం నుంచి 12 శాతానికి పెరిగితే, 48 నెలల కాలానికి నెలవారీ ఈఎంఐ సుమారు రూ.13 వేల నుంచి రూ.13,200కు పైగా పెరిగే అవకాశం ఉంటుంది.
చిన్న, మధ్య తరహా వ్యాపారాలపైనా వడ్డీ రేట్ల పెంపు ప్రభావం పడవచ్చు. వర్కింగ్ క్యాపిటల్, వ్యాపార విస్తరణ, కొత్త యంత్రాల కొనుగోలు కోసం తీసుకునే రుణాల వ్యయం పెరగవచ్చు. దీంతో వ్యాపారాల నెలవారీ ఆర్థిక భారం కూడా అధికమయ్యే అవకాశం ఉంది.
అయితే రెపో రేటు పెంపు ప్రభావం ప్రతి రుణగ్రహీతపై ఒకే విధంగా ఉండదు. రుణ రకం, బ్యాంకు, వడ్డీ రేటు, మిగిలిన రుణ కాలపరిమితి వంటి అంశాలపై ఈఎంఐలో మార్పు ఆధారపడి ఉంటుంది. మొత్తంగా చూస్తే.. రెపో రేటు పెంపుతో కొత్తగా రుణాలు తీసుకునేవారు, ఇప్పటికే ఫ్లోటింగ్ రేట్ రుణాలు చెల్లిస్తున్నవారు తమ నెలవారీ బడ్జెట్‌ను జాగ్రత్తగా పరిశీలించాల్సిన అవసరం ఉంది.








కామెంట్‌లు (0)