సోమవారం, 13 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionఐదు నెలల గరిష్ఠానికి వాణిజ్య లోటు

4 గంటల క్రితం

Trade deficit
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 13, 2026, 09:39 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

  • జూన్‌‌లో 30.43 బిలియన్‌ డాలర్లకు చేరిక

  • ఎగిసిన దిగుమతుల ఎఫెక్ట్‌

‌న్యూఢిల్లీ : అమాంతం పెరిగిన వాణిజ్య లోటు భారత ఆర్థిక వ్యవస్థను కలవరానికి గురి చేస్తోంది. ఈ ఏడాది జూన్‌‌లో దేశ వాణిజ్య లోటు 30.43 బిలియన్ డాలర్లకు ఎగిసి.. గత ఐదు నెలల గరిష్ఠ స్థాయిని తాకింది. గతేడాది జూన్ నెలలో ఈ లోటు 19.10 బిలియన్ డాలర్లుగా ఉంది. ఒక్క ఏడాది వ్యవధిలోనే ఇది భారీగా పెరగడం విదేశీ వాణిజ్య సమతుల్యతపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ పరిణామం కరెంట్ అకౌంట్ లోటుపై, విదేశీ మారక నిల్వలపై ఒత్తిడి పెంచుతుందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. దిగుమతుల విలువ వేగంగా పెరగడం వల్ల విదేశీ మారక నిల్వలపై ఒత్తిడి పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. ​ప్రధానంగా జూన్‌లో భారత వస్తు దిగుమతులు 31 శాతం పెరిగి 70.84 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. ముఖ్యంగా ముడి చమురు, బంగారం ధరలు పెరగడం వల్ల దిగుమతి బిల్లు భారీగా పెరిగినట్లు వాణిజ్య శాఖ వెల్లడించింది. అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు అధికంగా కొనసాగితే దిగుమతుల వ్యయం మరింత పెరిగే ప్రమాదం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.

​ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌ ‌నుంచి జూన్‌‌తో ముగిసిన తొలి త్రైమాసికంలో కూడా ఇదే తీరు కనిపించింది. ఈ కాలంలో మొత్తం దిగుమతులు 216.18 బిలియన్ డాలర్లకు చేరింది. గతేడాదితో పోలిస్తే 20 శాతం పెరుగుదల చోటు చేసుకుంది. ఎగుమతుల కంటే దిగుమతులు ఎక్కువగా పెరిగితే రూపాయి విలువ, విదేశీ మారక నిల్వలపై అదనపు ఒత్తిడి ఏర్పాడుతుంది. మరోవైపు జూన్‌లో వస్తు ఎగుమతులు దాదాపు 16 శాతం పెరిగి 40.41 బిలియన్ డాలర్లకు చేరుకున్నప్పటికీ, దిగుమతుల పెరుగుదలతో పోలిస్తే ఈ వృద్ధి సరిపోలేదు. అదే విధంగా ఏప్రిల్–జూన్ కాలంలో మొత్తం ఎగుమతులు 16 శాతం పెరిగి 129.32 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. పెరుగుతున్న దిగుమతి వ్యయాన్ని సమతుల్యం చేయలేకపోవడంతో వాణిజ్య లోటు మరింత పెరిగిందని స్పష్టమవుతోంది. ముఖ్యంగా ముడి చమురు, బంగారం వంటి దిగుమతులపై అధికంగా ఆధారపడటం వల్ల అంతర్జాతీయ ధరల్లో మార్పులు నేరుగా దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపే పరిస్థితి ఏర్పడుతోంది. ఎగుమతుల వృద్ధి మరింత వేగం పుంజుకోకపోతే.. రాబోయే నెలల్లో వాణిజ్య లోటు మరింత పెరిగి ఆర్థిక స్థిరత్వంపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్