- సరుకు దిగుమతుల పెరుగుదల ప్రభావం
న్యూఢిల్లీ: దేశ ఆర్థిక వ్యవస్థకు ఆందోళన కలిగించే విధంగా భారత్ వాణిజ్య లోటు భారీగా పెరిగింది. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలు, అంతర్జాతీయ రవాణా వ్యయాల పెరుగుదల నేపథ్యంలో జులైలో దేశ వస్తు వాణిజ్య లోటు 31.98 బిలియన్ డాలర్లకు చేరింది. ఇది ఆరు నెలల గరిష్ఠ స్థాయి కావడం ఆందోళనకరం. జూన్‌లో నమోదైన 30.43 బిలియన్ డాలర్లతో పోలిస్తే లోటు మరింత పెరిగింది. ఆర్థికవేత్తలు అంచనా వేసిన 30.20 బిలియన్ డాలర్ల కంటే కూడా ఇది అధికం కావడం ఆందోళన కలిగిస్తోంది.
దిగుమతుల వేగం పెరగడమే వాణిజ్య లోటు విస్తరణకు ప్రధాన కారణంగా నిలిచింది. జులైలో దేశ దిగుమతులు 76.22 బిలియన్ డాలర్లకు చేరాయి. జూన్‌లో ఇవి 70.84 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. ముఖ్యంగా ఎలక్ట్రానిక్ వస్తువులు, బంగారం దిగుమతులు భారీగా పెరగడం విదేశీ మారకద్రవ్యంపై ఒత్తిడిని పెంచుతోంది. ఎలక్ట్రానిక్ వస్తువుల దిగుమతులు 44 శాతానికి పైగా పెరిగి 14.37 బిలియన్ డాలర్లకు చేరగా, బంగారం దిగుమతులు దాదాపు 5 శాతం పెరిగి 4.16 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి.
రూపాయిపై ఒత్తిడి..
దిగుమతుల పెరుగుదల ప్రభావం దేశ విదేశీ మారకద్రవ్య నిల్వలు, రూపాయి విలువపై పడే అవకాశం ఉంది. వాణిజ్య లోటు ఎక్కువ కాలం కొనసాగితే దిగుమతుల కోసం విదేశీ మారకద్రవ్య డిమాండ్ పెరుగుతుంది. ఫలితంగా రూపాయిపై ఒత్తిడి పెరగడంతో పాటు విదేశీ పెట్టుబడుల ప్రవాహంపైనా ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న అనిశ్చితికి ఇది అదనపు భారంగా మారవచ్చు.
దిగుమతుల భారం..
ఎగుమతులు కొంత పెరిగినప్పటికీ.. దిగుమతుల వేగాన్ని అధిగమించలేకపోవడం ప్రధాన సమస్యగా మారింది. జులైలో వస్తు ఎగుమతులు 44.24 బిలియన్ డాలర్లకు చేరాయి. ఇది 2022 జులైలో నమోదైన 38.34 బిలియన్ డాలర్ల మునుపటి గరిష్ఠాన్ని అధిగమించింది. అయితే భారీ దిగుమతుల కారణంగా ఎగుమతుల పెరుగుదల వాణిజ్య లోటును నియంత్రించలేకపోయింది. సేవల రంగంలో భారత్‌కు 16.95 బిలియన్ డాలర్ల మిగులు నమోదైనప్పటికీ, వస్తు వాణిజ్య లోటు పెరుగుదల ఆర్థిక వ్యవస్థకు సవాలుగానే మారుతోంది. ఏప్రిల్ నుంచి జులై వరకు అమెరికాకు 33.49 బిలియన్ డాలర్ల విలువైన వస్తువులను భారత్ ఎగుమతి చేసింది. అయితే అమెరికా విధించిన కొత్త సుంకాలు, అంతర్జాతీయ వాణిజ్య విధానాల్లో మార్పులు రానున్న నెలల్లో ఎగుమతులపై మరింత ఒత్తిడి తీసుకురావచ్చన్న ఆందోళన ఉంది.
రవాణా వ్యయాల దెబ్బ..
ఇదే సమయంలో పెరుగుతున్న సముద్ర రవాణా వ్యయాలు ఎగుమతిదారుల సమస్యలను మరింత తీవ్రం చేస్తున్నాయి. పశ్చిమాసియా ఉద్రిక్తతలు, నౌకల కొరత, కంటైనర్ల లభ్యతలో సమస్యల కారణంగా అమెరికా, ఐరోపా, పశ్చిమాసియా మార్గాల్లో రవాణా ఛార్జీలు పెరిగాయి. దీంతో బియ్యం, వస్త్రాలు, ఔషధాలు, ఇంజనీరింగ్ ఉత్పత్తుల ఎగుమతిదారుల లాభదాయకత దెబ్బతింటోంది. రవాణాలో జాప్యం, షెడ్యూళ్లలో అనిశ్చితి కూడా ఎగుమతి రంగంపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. దిగుమతులపై అధికంగా ఆధారపడటం, వాణిజ్య లోటు పెరుగుదల, అంతర్జాతీయ రవాణా వ్యయాల పెరుగుదల కలిసి భారత ఆర్థిక వ్యవస్థకు బహుళ ఒత్తిడిని సృష్టిస్తున్నాయి. దిగుమతుల నియంత్రణ, దేశీయ ఉత్పత్తి సామర్థ్యాల పెంపు, ఎగుమతులకు మద్దతు, రవాణా సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని తాజా గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.








కామెంట్‌లు (0)