- డిఫెన్స్ అక్విజిషన్ కమిటీ (డిఏసి) ఆమోదం
న్యూఢిల్లీ: ఫ్రాన్స్ నుంచి 114 రఫేల్ యుద్ధ విమానాలను కొనుగోలు చేసే భారీ రక్షణ ఒప్పందాన్ని వచ్చే ఆర్థిక సంవత్సరం మార్చి నాటికి పూర్తి చేయాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుంది. భారత వైమానిక దళం యుద్ధ సామర్థ్యాలను మరింత బలోపేతం చేయడంలో భాగంగా ఈ విమానాలను సుమారు రూ.3.25 లక్షల కోట్ల వ్యయంతో కొనుగోలు చేయనున్నారు. ఈ ప్రాజెక్టుకు 2026 ఫిబ్రవరిలో డిఫెన్స్ అక్విజిషన్ కమిటీ (డిఏసి) ఆమోదం తెలిపింది. ఒప్పందంలో భాగంగా ఎక్కువ విమానాలను భారత్‌లోనే తయారు చేయాలని నిర్ణయించారు. సుమారు 90 రఫేల్ విమానాలను ఫ్రెంచ్ సంస్థ డాసాల్ట్ ఏవియేషన్, దాని భారత భాగస్వామితో కలిసి దేశంలో తయారు చేయనుండగా.. మిగిలిన విమానాలను ఫ్రాన్స్ నుంచి నేరుగా సరఫరా చేయనున్నారు. కొత్త రఫేల్ విమానాల్లో భారతీయ ఆయుధాలు, రక్షణ వ్యవస్థలను మరింతగా అనుసంధానించాలని భారత్ నిర్ణయించింది. ఇందుకు ఫ్రెంచ్ సంస్థ అంగీకరించినట్లు సమాచారం. ప్రస్తుతం భారత వైమానిక దళం వద్ద 36 రఫేల్ విమానాలు ఉన్నాయి. నౌకాదళం కోసం మరో 26 రఫేల్ మెరైన్ విమానాల కొనుగోలుకు భారత్, ఫ్రాన్స్ గత ఏడాది ఒప్పందం చేసుకున్నాయి.
114 రఫేల్ విమానాల ఒప్పందం ఖరారైతే.. కేంద్ర ప్రభుత్వం కుదుర్చుకున్న అతిపెద్ద రక్షణ ఒప్పందాల్లో ఇది ఒకటిగా నిలవనుంది. ఐదో తరం యుద్ధ విమానాల ప్రతిపాదనలు ఉన్నప్పటికీ, భారత్ 4.5వ తరం రఫేల్ విమానాల కొనుగోలుకు ప్రాధాన్యం ఇచ్చింది.








కామెంట్‌లు (0)