న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్‌కుమార్‌కు వ్యతిరేకంగా ఆందోళనలు మిన్నంటుతుండగా, సంఘ్‌పరివార్‌కు సన్నిహితంగా ఉండే 42 మంది సుప్రీంకోర్టు, హైకోర్టు మాజీ న్యాయమూర్తులు ఆయనను, ఎన్నికల కమిషన్‌ను సమర్ధించారు. ఈ మేరకు గురువారం ఒక బహిరంగ లేఖ విడుదల చేశారు. కచ్చితమైన ఓటర్ల జాబితాలు, స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత ఎన్నికలకు మద్దతు ఇవ్వడమే ఎన్నికల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) ఉద్దేశమని పేర్కొన్నారు. "ఐదు దశాబ్దాలకు పైగా ఈ దేశాన్ని పాలించిన ఒక పార్టీ, ఇప్పుడు తమను ఎన్నుకున్న వ్యవస్థలోనే అవకతవకలు జరిగాయని ఆరోపిస్తోంది. అది ఒంటరిగా ఈ పని చేయడం లేదు. ఎంపిక చేసిన కేసులతో సుదీర్ఘ చరిత్ర కలిగిన కార్యకర్తల సంఘాలు ఈ ఆరోపణలకు చట్టబద్ధత ముసుగు కల్పిస్తున్నాయి" అని పేర్కొన్నారు. ఈ లేఖపై సంతకాలు చేసిన వారిలో సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తులు హేమంత్ గుప్తా, పంకజ్ మిథాల్, హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తులు బి.సి. పటేల్, సుభ్రో కమల్ ముఖర్జీ, పర్మోద్ కోహ్లీ తదితరులు ఉన్నారు.
ఇండియన్ యూత్ కాంగ్రెస్ పిల్‌పై నేడు ఢిల్లీ హైకోర్టు విచారణ
ఎస్‌ఐఆర్ ప్రక్రియకు వ్యతిరేకంగా జంతర్ మంతర్ వద్ద నిరసనలు చేయడానికి ఢిల్లీ పోలీసులు అనుమతి నిరాకరించడాన్ని సవాల్ చేస్తూ ఇండియన్ యూత్ కాంగ్రెస్ (ఐవైసి) దాఖలు చేసిన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు శుక్రవారం విచారించనుంది. గురువారం తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి నితిన్ వాసుదేవ్ సాంబ్రే, జస్టిస్ సంజయ్ శర్మలతో కూడిన ధర్మాసనం పరిశీలించింది.








కామెంట్‌లు (0)