గురువారం, 27 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

పశ్చిమబెంగాల్‌లో నవజాత శిశువుల మృతిపై కలకలం .. మాల్డా ఆస్పత్రిపై విచారణ

1 గంట క్రితం

Malda hospital
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 27, 2026, 02:46 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

కోల్‌కతా : పశ్చిమ బెంగాల్‌లోని మాల్డా మెడికల్‌ కాలేజ్‌ అండ్‌ హాస్పిటల్‌ (ఎంఎంసీహెచ్‌)లో ఆగస్టు మొదటి మూడు వారాల్లో 60 మంది నవజాత శిశువులు మృతి చెందడం కలకలం రేపింది. ముఖ్యంగా ఒక్కరోజే 10 మంది శిశువులు మరణించడంతో రాష్ట్ర ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. ఈ మరణాలపై ఆస్పత్రి నుంచి సమగ్ర నివేదికను కోరడంతోపాటు, శిశువులను ఎంఎంసీహెచ్‌కు రిఫర్‌ చేసిన ఆస్పత్రులు, నర్సింగ్‌హోమ్‌లు, బ్లాక్‌ స్థాయి ఆరోగ్య కేంద్రాల పనితీరుపైనా సమీక్ష ప్రారంభించింది. మరణించిన 60 మంది శిశువుల్లో 44 మంది ఇతర ఆస్పత్రుల్లో జన్మించి, ఆరోగ్యం విషమించడంతో ఎంఎంసీహెచ్‌కు రిఫర్‌ చేయబడినవారేనని ప్రాథమిక నివేదిక వెల్లడించింది. దీంతో మాల్దా మెడికల్‌ కాలేజ్‌ ఆస్పత్రిలో పరిస్థితులతోపాటు, శిశువులను అక్కడికి పంపించే ముందు వారికి చికిత్స అందించిన వైద్య కేంద్రాల పనితీరుపైనా అధికారులు దృష్టి సారించారు.


ఆగస్టు రెండో వారంలో ఒక్కరోజే 10 మంది నవజాత శిశువులు మరణించారు. వీరిలో ఎనిమిది మంది ఇతర ఆస్పత్రుల్లో జన్మించి, పరిస్థితి అత్యంత విషమించడంతో ఎంఎంసీహెచ్‌కు తీసుకువచ్చినవారు కాగా, మరో ఇద్దరు శిశువులు ఎంఎంసీహెచ్‌లోనే జన్మించారు. ఈ విషయాన్ని ఆస్పత్రి సూపరింటెండెంట్‌ ప్రసేన్‌జిత్‌ బార్‌ ధ్రువీకరించారు. ఆస్పత్రికి తీసుకువచ్చే సమయానికే ఎనిమిది మంది శిశువుల పరిస్థితి అత్యంత విషమంగా ఉందని తెలిపారు. రాష్ట్ర ఆరోగ్యశాఖకు సమర్పించేందుకు సమగ్ర నివేదికను సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. శ్వాసకోశ సమస్యలు, కామెర్లు, పుట్టుకతో వచ్చే గుండె సంబంధిత లోపాలు తదితర తీవ్రమైన ఆరోగ్య సమస్యలు మరణాలకు కారణమైనట్లు వైద్య అధికారులు అయితే ఇంత తక్కువ వ్యవధిలో పెద్ద సంఖ్యలో మరణాలు చోటుచేసుకోవడంతో, శిశువులను రిఫర్‌ చేసిన వైద్య కేంద్రాల్లో వారికి అందిన చికిత్స, రిఫర్‌ చేయడంలో జరిగిన జాప్యం వంటి అంశాలపై కూడా దృష్టిసారించినట్లు అధికారులు తెలిపారు.


రాష్ట్ర ఆరోగ్యశాఖ ఆదేశాలతో ఇప్పటికే ప్రాథమిక విచారణ ప్రారంభమైంది. ఇందులో భాగంగా 16 ఆస్పత్రులు, నర్సింగ్‌హోమ్‌లను అధికారులు తనిఖీ చేశారు. శిశువులను ఎప్పుడు చేర్చుకున్నారు, వారికి ఎలాంటి చికిత్స అందించారు, ఎప్పుడు ఎంఎంసీహెచ్‌కు రిఫర్‌ చేశారు తదితర వివరాలను పరిశీలిస్తున్నారు. ప్రాథమిక విచారణ నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించినట్లు సమాచారం. మాల్డా జిల్లా మేజిస్ట్రేట్‌ గురువారం సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. తదుపరి చర్యలపై కూడా ఈ సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అన్నారు. అయితే 60 మంది శిశువుల మరణాలకు వైద్యుల నిర్లక్ష్యమే కారణమని ఇప్పటివరకు అధికారికంగా నిర్ధారణ కాలేదు. తీవ్ర అనారోగ్యంతో ఇతర ఆస్పత్రుల నుంచి ఎంఎంసీహెచ్‌కు తీసుకువచ్చిన శిశువుల సంఖ్య అధికంగా ఉన్నందున, వారికి అందించిన ప్రాథమిక చికిత్స, రిఫరల్‌లో జరిగిన పరిణామాలు కూడా మరణాలపై ప్రభావం చూపాయా అనే కోణంలో విచారణ కొనసాగుతోంది. పూర్తి నివేదిక అనంతరం మరణాలకు దారితీసిన కారణాలు, రిఫరల్‌ వ్యవస్థలో లోపాలు ఏమైనా ఉన్నాయా అనే అంశాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్