- ఇళ్ళలో పనులు చేయడం, ఆదాయం, వివాహం వంటివే ప్రధాన కారణాలు
న్యూఢిల్లీ : సెకండరీ పాఠశాలల్లో చేరిన ప్రతి వంద మంది బాలికల్లో 8మంది 2025-26లో తమ విద్యను పూర్తి చేయడానికి ముందుగానే స్కూలు మానేస్తున్నారు. గత వారం లోక్‌సభలో విద్యా శాఖ మంత్రిత్వ శాఖ ఇచ్చిన సమాధానంలో కీలకాంశం ఇదే. బాలికలకు సంబంధించినంతవరకు సెకండరీ స్కూల్ డ్రాపౌట్ రేటు 8శాతానికి పడిపోయింది. గత మూడేళ్ళలో ఇదే అత్యంత తక్కువ. 2023-24లో ఇది 12.6శాతంగా వుండగా, 2024-25నాటికి 9.6శాతానికి తగ్గింది. ప్రాధమిక పాఠశాల స్థాయిలో డ్రాపౌట్ల కన్నా ఈ రేటు బాగా అధికంగా వుంది. ప్రస్తుతం నమోదైన అత్యంత తక్కువ రేటునే పరిగణనలోకి తీసుకున్నా కూడా ప్రాధమిక పాఠశాలల డ్రాపౌట్లతో పోలిస్తే దాదాపు 80రెట్లు అధికంగా వుంది. పార్లమెంట్ సభ్యుడు గుర్మీత్ సింగ్ మీట్ హయర్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా కేంద్ర విద్యా శాఖ సహాయ మంత్రి జయంత్ చౌదరి ఈ సమాధానాన్ని ఇచ్చారు. ప్రభుత్వ స్వంత స్కూల్ డేటాబేస్ యుడిఐఎస్‌ఇ ప్లస్ నుండి ఈ గణాంకాలను సేకరించారు. ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ, సెకండరీ స్థాయిలుగా మూడు కేటగిరీలుగా విభజించారు. దాదాపు ప్రతీ రాష్ట్రంలోనూ ఇదే రకమైన ధోరణి నెలకొని వుంది. బాలికలు తొలి సంవత్సరాల్లో అంటే 6 నుండి 8 తరగతుల మధ్య కాలంలోనే స్కూలు మానేస్తుంటారు. 9 లేదా 10వ తరగతికి వచ్చేసరికి ఈ సంఖ్య చాలా ఎక్కువగా వుంటోంది. ఆ వయస్సు నాటికి బాలికలు రజస్వల కావడం లేదా ఇళ్ళలో పనులు చేసేందుకు, కుటుంబ ఆదాయం సరిపోక పనులకు వెళ్ళేందుకు, లేదా వివాహం వంటి కారణాలు చదువు మానేయడానికి ప్రధాన కారణాలుగా వున్నాయి. ఆడపిల్లలకు ఇంక చదువు అక్కర్లేదులే అనే భావన తల్లిదండుల్లో వుండడం కూడా మరో కారణంగా వుంది. జాతీయ స్థాయిలో చూసినట్లైతే ప్రాధమిక పాఠశాలల స్థాయిలో బాలికలు చదువు మానేయడమనేది దాదాపు లేదనే చెప్పవచ్చు, కేవలం 0.1 శాతంగా వుంది. అదే అప్పర్ ప్రైమరీ స్థాయికి వస్తే 3.4శాతంగా వుంది. ఇక సెకండరీ స్థాయిలో 8శాతం మంది బాలికలు మానేస్తున్నారు.








కామెంట్‌లు (0)