- మహారాష్ట్రలో యథాతథంగా కొనసాగనున్న 2వేల పోస్టులు
ముంబయి : కేంద్ర ప్రభుత్వం నిధుల్లో కోత విధించిన కారణంతో దాదాపు 2వేల మంది పెసా గ్రామ సభ మొబలైజర్స్ ఉపాధి కోల్పోయే ముప్పు పొంచి వున్న నేపథ్యంలో ఆదివాసీ అధికార్ రాష్ట్రీయ మంచ్ (ఎఎఆర్‌ఎం), పెసా మొబలైజర్స్ పోరాట కమిటీ కలిసి మహారాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టాయి. మే 6వ తేదీన వందలాదిమంది పెసా కార్యకర్తలు పూనేలో నిరసనల తెలియచేశారు. జులై 1న ముంబయిలోని అజాద్ మైదాన్ వద్ద భారీగా వర్షం పడుతున్నా వెయ్యి మందికి పైగా ర్యాలీలో పాల్గొన్నారు. చివరకు ఎఎఆర్‌ఎం, ఐద్వా నేత మరియం ధావలె, ఎఐకెఎస్ అధ్యక్షులు అశోక్ ధావలె, సిఐటియు నేత అజిత్ అభయంకర్, సిపిఎం ఎంపి జాన్ బ్రిట్టాస్, సిపిఎం సీనియర్ నేత బృందా కరత్‌లు ఈ పోరాటాన్ని జాతీయ స్థాయికి తీసుకెళ్ళారు. ఆగస్టు 4 నుండి రాలెగావ్‌లో నిరవధిక ధర్నా చేపడతామని ప్రకటించారు. దాంతో ఈ ఉద్యమంపై మహారాష్ట్ర ప్రభుత్వం స్పందించాల్సి వచ్చింది. ఈ నెల 5న మహారాష్ట్ర గిరిజన అభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ అశోక్ ఉయికె, గ్రామీణాభివృద్ధి మంత్రి జయకుమార్ గోరె ఎఎఆర్‌ఎం, పెసా మొబలైజర్ ప్రతినిధులను కలిసి మాట్లాడారు. ఇంతకుముందు వున్నట్లుగా 3వేల పోస్టులను కొనసాగిస్తామని, నిధుల కొరతకారణంగా ఏ పోస్టునూ తొలగించబోమని హామీ ఇచ్చారు. అన్ని పోస్టులకు అవసరమైన నిధులు కేంద్రం అందచేసేలా రాష్ట్ర ప్రభుత్వం చర్చలు జరుపుతుందని ప్రకటించారు. ఈలోగా రాష్ట్ర గిరిజనాభివృద్ధి శాఖ ఈ పోస్టులు కొనసాగించేందుకు అవసరమైన నిధులు సమకూరుస్తుందని తెలిపారు. ఈ పోరాటంతో 2వేలమంది పెసా మొబలైజర్ల జీవనోపాధి కాపాడినట్లైంది. వీరిలో చాలామంది ఆదివాసీ మహిళలే, ఈ పోరాటం విజయం సాధించినా ఇక్కడితో అయిపోలేదు. కేంద్రప్రభుత్వం శాశ్వతంగా ప్రతిపాదిత కోతలను ఉపసంహరించి, దేశవ్యాప్తంగా ఈ పోస్టులకు అవసరమైన నిధులను అందచేయాల్సి వుంది.








కామెంట్‌లు (0)