ఆదివారం, 02 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

అంగన్‌‌వాడీలకు ఎఐఎఫ్‌ఎడబ్ల్యహెచ్‌ అభినందనలు

11 జులై, 2026

angawadi
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 11, 2026, 11:32 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా సమస్యల పరిష్కారం అంగన్‌‌వాడీ కార్యకర్తలు, సహాయకులు ఈ నెల 10న ‘నిరసన దినం’ పాటిస్తూ విజయవంతంగా ఆందోళనలు చేపట్టారని అఖిల భారత అంగన్‌‌వాడీ వర్కర్లు, హెల్పర్ల సమాఖ్య (ఎఐఎఫ్‌ఎడబ్ల్యహెచ్‌) అభినందనలు తెలిపింది. ఈ మేరకు సమాఖ్య ప్రధానకార్యదర్శి ఉషారాణి శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు అంగన్‌‌వాడీల సమస్యలు పరిష్కరించాలని, లేదంటే పోరాటం తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. పిల్లలందరికీ మెరుగైన పోషణ అందించడం, అన్ని అంగన్‌‌వాడీ కేంద్రాల్లో ప్రీ-స్కూల్ విద్యను కల్పించడం, 2018 నుండి స్తంభించిపోయిన వేతనాలను పెంచడం, సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం గ్రాట్యుటీ చెల్లింపునకు తక్షణమే ఆదేశించడం ద్వారా ఈ పథకాన్ని మెరుగుపరుస్తామని గత ఏడాది కాలంలో కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రి అన్నపూర్ణా దేవి తమకు రెండు సార్లు హామీ ఇచ్చారు కానీ ఆమె తన మాట నిలుబెట్టుకోకుండా వమ్ము చేశారని విమర్శించారు. కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చినప్పటి నుండి..బడ్జెట్ కోతలు, సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ గ్రాట్యుటీ చెల్లింపులను అమలు చేయకపోవడం, ఐసిడిఎస్ పథకం ప్రారంభమై 50 ఏళ్లు గడిచినా దానిని క్రమబద్ధీకరించడానికి నిరాకరించడం, అంగన్‌వాడీ కార్యకర్తలు మరియు సహాయకులకు కనీస వేతనాలు, పెన్షన్లు నిరాకరించడం వంటి చర్యలను కొనసాగిస్తోందన్నారు. ఇది కార్మికుల పట్ల మాత్రమే కాకుండా దేశ పిల్లల పట్ల, వారి పోషకాహార శ్రేయస్సు పట్ల కూడా ప్రభుత్వానికి ఉన్న ఉదాసీనతకు అద్దం పడుతోందని తెలిపారు. కేంద్రం అనుసరిస్తున్న ఈ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ ఈ నెల 10న బ్లాక్‌ ‌డేకి పిలుపునివ్వగా దేశవ్యాప్తంగా అంగన్‌‌వాడీలు పెద్ద సంఖ్యలో ఉద్యమించారని తెలిపారు. ప్రధానంగా అస్సాం, అండమాన్న్‌ - నికోబార్, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఛత్తీస్‌గఢ్, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, హర్యానా, జమ్మూకాశ్మీర్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్‌లోని జిల్లా కలెక్టర్ల కార్యాలయాల వద్ద భారీ ఆందోళనలు చేపట్టారని అభినందించారు. ‘పిల్లలే భారతదేశ భవిష్యత్తు. దేశంలో నెలకొని ఉన్న పోషకాహార లోపం దృష్ట్యా, అంగన్‌వాడీ కేంద్రాలకు తగిన నిధులు, నాణ్యమైన సామాజిక నివేదికలు, మౌలిక సదుపాయాలు కల్పించడం, అలాగే ఈ పథకాన్ని అమలు చేసే అంగన్‌వాడీ కార్యకర్తలు మరియు సహాయకులకు క్రమబద్ధీకరణ మరియు పూర్తి సామాజిక భద్రతను హామీ ఇవ్వడం ప్రభుత్వ విధి’ అని ఆమె గుర్తు చేశారు. ఈ ఆందోళనల్లో ఆశా, మధ్యాహ్న భోజన పథకం కార్మిక సంఘాలైన ఎడబ్ల్యుఎఫ్‌ఎఫ్‌ఐ, ఎండిఎంఎఫ్‌‌డబ్ల్యుఐ ఉమ్మడి పిలుపుతో స్పందించి ఆందోళనను విజయవంతంగా చేపట్టిన శ్రమజీవులందరికీ ఎఐఎఫ్‌ఎడబ్ల్యహెచ్‌ అభినందనలు తెలిపింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్