ఆదివారం, 02 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

విద్యార్థుల‌పై దాడికి అమిత్ షా స‌మాధానం చెప్పాలి

1 రోజు క్రితం

rahul
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 01, 2026, 01:03 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

- లేదంటే రాజీనామా చేయాలి

- ఉభ‌య స‌భ‌ల్లో కొన‌సాగిన ఆందోళ‌న

- అయోధ్య విరాళాల చోరీపై వినూత్న ఆందోళ‌న‌

ప్ర‌జాశ‌క్తి - న్యూఢిల్లీ బ్యూరో : జంతర్ మంతర్ వద్ద నిరసన చేస్తున్న విద్యార్థులు, యువకులపై పోలీసులు, కేంద్ర బలగాలు దాడి చేయడానికి కారణమైన హోం మంత్రి అమిత్ షాకు వ్యతిరేకంగా ప్రతిపక్షాల నిరసన కొనసాగుతోంది. సమాధానం చెప్పాల్సిన అమిత్‌ షా ముఖం చాటేయడం, ప్రతిపక్ష‍ాల నిరసన కొనసాగడంతో శుక్రవారం పార్లమెంటు ఉభయ సభలకు అంతరాయం కలిగింది. విద్యార్థులపై ఎవరి ఆదేశాల మేరకు కేంద్ర బలగాలు పెల్లెట్ గన్‌లను ఉపయోగించాయో పార్లమెంటులో అమిత్ షా వివరించాలని ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. దీనికి ఆయన సిద్ధంగా లేకపోతే, హోం మంత్రి పదవికి రాజీనామా చేయాలని కోరాయి. రాజ్యసభ ఎలాంటి కార్యకలాపాలు చేపట్టకుండానే సోమవారం సమావేశానికి వాయిదా పడింది. లోక్‌సభను తొలుత మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు. తిరిగి సమావేశమైనప్పుడు కూడా హోం మంత్రి స్పందన లేకపోవడంతో ప్రతిపక్ష ఎంపిలు వెల్‌లోకి దూసుకెళ్లి ఆందోళ‌న చేప‌ట్టారు. ప్రతిపక్షాల నిరసనల మధ్య, జనన, మరణ నమోదు నిబంధనలను మరింత కఠినతరం చేసే బిల్లును ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఇదిముఖ్యమైన బిల్లు అయినప్పటికీ, చర్చ లేకుండా త్వరితగతిన ఆమోదించారు. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ రూపొందించిన ఈ బిల్లుపై చర్చ జరుగుతున్నప్పుడు కూడా హోం మంత్రి అమిత్ షా సభలో లేకపోవడాన్ని ప్రతిపక్ష పార్టీలు ప్రశ్నించాయి. బిల్లును ఏకపక్షంగా ఆమోదించిన అనంతరం, సోమవారం లోక్‌సభ కూడా వాయిదా పడింది.

కొనసాగుతున్న మోడీ, అమిత్ షా గైర్హాజ‌రు

జంతర్ మంతర్ వద్ద విద్యార్థులపై దాడి తరువాత‌, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా పార్లమెంటు ఉభయ సభలకు ఇప్పటివరకూ హాజరుకాలేదు. శుక్రవారం లోక్‌సభలో జనన, మరణాల నమోదు సవరణ బిల్లు ఆమోదం పొందినప్పుడు కూడా అమిత్ షా దూరంగా ఉన్నారు. వర్షాకాల సమావేశాల మొదటి రోజున అమిత్ షా ఈ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టారు. శుక్రవారం బిల్లు ఆమోదం పొందినప్పుడు హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ హాజరయ్యారు. కేంద్ర హోం మంత్రి సభకు హాజరు కావాలని డిమాండ్ చేస్తూ ప్రతిపక్ష సభ్యులు నిరసన తెలుపుతున్న సమయంలో ఈ బిల్లు ఆమోదం పొందింది. పరీక్షలలో అవకతవకలను నిరోధించే ముఖ్యమైన సవరణ బిల్లును లోక్‌సభలో ఆమోదం కోసం ప్రవేశపెట్టినప్పుడు కూడా మోడీ, షా సభకు హాజరు కాలేదు.

అయోధ్య విరాళాల చోరీపై వినూత్న ఆందోళ‌న‌

అయోధ్యలోని రామమందిరంలో విరాళాల చోరీపై ప్రతిపక్ష ఎంపిలు వినూత్నంగా ఆందోళ‌న చేప‌ట్టారు. పార్ల‌మెంట్ ఆవ‌ర‌ణలో ఒక వీధి నాటకాన్ని ప్రదర్శించారు. బీహార్‌లోని పూర్నియా ఎంపి పప్పు యాదవ్ ఒక హిందూ సన్యాసి వేషంలో కనిపించారు. సమాజ్‌వాదీ పార్టీ మహిళా ఎంపి భక్తురాలి పాత్రను పోషించారు. వారికి చుట్టూ చాలా మంది రౌండ్‌గా నిలబడి ఉన్నారు. ప‌ప్పు యాద‌వ్‌ ముందు ఓ టేబుల్ వేసి దానిపై హుండి పెట్టారు. ఆ టేబుల్‌కు అటు ఇటు మరో రెండు హుండీలు ఏర్పాటు చేశారు. భక్తురాలు గుడి పేరు మీద డబ్బు సమర్పించగా, ఆ సన్యాసి ‘దొంగతనం మా రక్తంలోనే ఉంది’ అని చెబుతూ ఆ విరాళాన్ని తన జేబులో వేసుకున్నారు. అంతలో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, ఎంపి రాహుల్ గాంధీ సహా పలువురు ఎంపిలు ఆ హుండిలో నగదు వేశారు. ఆ తరువాత యాదవ్ పాత్ర ఎంపి ఆ విరాళాల పెట్టెను తీసుకుని వెళ్ళిపోతారు. కానుకలు, అధికారాన్ని అపహరించారంటూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ‘కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా సభకు ఎందుకు రావడం లేదు? విద్యార్థులపై దమనకాండకు ఆదేశాలు ఎవరిచ్చారు?’ అని రాసి ఉన్న పెద్ద బ్యానర్‌ను ప్రదర్శించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్