- రాజస్థాన్ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆసక్తికర ఘటన
పర్బత్సర్: రాజస్థాన్ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. పర్బత్సర్ మున్సిపాలిటీలోని 13వ వార్డు నుంచి బిజెపి తరఫున పోటీ చేసిన కైలాష్ చంద్‌కు కేవలం ఒక్క ఓటు మాత్రమే వచ్చింది. రాష్ట్ర ఎన్నికల సంఘం వెల్లడించిన వివరాల ప్రకారం కాంగ్రెస్ అభ్యర్థి హీనా ఖాన్ 376 ఓట్లతో విజయం సాధించగా, స్వతంత్ర అభ్యర్థి రషీద్ ఖాన్ 195 ఓట్లతో రెండో స్థానంలో నిలిచారు. కైలాష్ చంద్ పర్బత్సర్ మున్సిపాలిటీలోని 12వ వార్డు ఓటరు. అయినప్పటికీ బిజెపి ఆయనను పక్కనే ఉన్న 13వ వార్డు నుంచి పోటీకి దింపింది. మొత్తం 25 వార్డులున్న పర్బత్సర్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ 13 స్థానాలు, బిజెపి 12 స్థానాలు గెలుచుకున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 309 పట్టణ స్థానిక సంస్థలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు కొనసాగుతున్న సమయంలో కైలాష్ చంద్‌కు ఒక్క ఓటు మాత్రమే రావడం చర్చనీయాంశంగా మారింది. మరోవైపు నోఖా మున్సిపల్ కార్పొరేషన్‌లో సిపిఎం ఘన విజయం సాధించింది. మొత్తం 45 స్థానాలకు గాను 29 స్థానాలను కైవసం చేసుకుని మున్సిపల్ పాలనను సొంతం చేసుకుంది. బిజెపి 13 స్థానాల్లో విజయం సాధించగా, స్వతంత్ర అభ్యర్థులు మూడు స్థానాల్లో గెలుపొందారు.








కామెంట్‌లు (0)