- చర్చలే పరిష్కార మార్గం
- విద్యార్థుల ఆందోళనలపై జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్
రాంఛి : యువత, విద్యార్థులను సొంత బిడ్డలుగా భావిస్తామని, అలాంటి వాళ్లు వ్యవస్థలోని లోపాలను ఎత్తిచూపుతూ ఆందోళనలు చేపడితే వారిపై లాఠీలు, తూటాలు, పెల్లెట్ గన్నులు ఉపయోగిస్తున్నారని, ఇది దారుణమని పరోక్షంగా బిజెపి పాలకుల తీరును జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ఎండగట్టారు. తమ మార్గం అలాంటి హింసామార్గం కానేకాదని స్పష్టం చేశారు. జార్ఖండ్‌లో ప్రభుత్వ ఉద్యోగ నియామక పరీక్షల్లో (జెపిఎస్‌సి, జెఎస్‌ఎస్‌సి) అక్రమాలు, అవకతవకలు జరిగాయంటూ విద్యార్థులు, యువత చేస్తున్న ఆందోళనలను ఆయన ప్రస్తావిస్తూ ఈ విషయంలో విద్యార్థులతో, యువతతో చర్చలు ద్వారానే పరిష్కారాలు కనుగొంటామని తెలిపారు. విద్యార్థులు చేస్తున్న ఆందోళనలను అణిచేసేందుకు తమ ప్రభుత్వం ఎలాంటి హింసాత్మక చర్యలు చేపట్టబోదని స్పష్టం చేశారు. ఆదివారం నాడు జార్ఖండ్‌లో ఆదివాసీ మహోత్సవ్ కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ విదార్థులు లేవనెత్తిన సమస్యలను పరిష్కరించడానికి తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. విద్యా వ్యవస్థ, పరీక్షలు, అలాగే నియామక ప్రక్రియలను మరింత మెరుగపర్చేందుకు, పటిష్టపర్చేందుకు విద్యార్థులు, యువత నుంచి సలహాలు, సూచనలను ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థుల సమస్య తన సమస్యేనని, పరీక్షల్లో అక్రమాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. సమస్యల్ని లాఠీలు, బుల్లెట్లతో కాకుండా చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని హేమంత్ సోరెన్ అన్నారు.
16వ రోజుకు చేరిన నిరసనలు
జెపిఎస్‌సి, జెఎస్‌ఎస్‌సి నియామక పరీక్షల్లో అవకతవకలు జరిగాయంటూ విద్యార్థులు చేపట్టిన నిరసనలు ఆదివారంతో 16 వ రోజుకు చేరాయి. విద్యార్థులు రాత్రింబవళ్లు ఆందోళనలు, నిరవధిక ధర్నా కొనసాగిస్తున్నారు. ఆరుగురు విద్యార్థులు నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్నారు.
విద్యార్థులతో ప్రభుత్వం చర్చలు
ఈ నేపథ్యంలో రాంచీలోని స్టేట్ గెస్ట్ హౌస్‌లో ప్రభుత్వం, జెపిఎస్‌సి, జెస్‌ఎస్‌సి అభ్యర్థుల ప్రతినిధుల మధ్య మరోసారి చర్చలు జరిగాయి. 8 మంది ప్రతినిధులు మంత్రులు దీపికా పాండే సింగ్, సుదివ్య కుమార్, చామ్రా లిండా, సంజయ్ యాదవ్‌తో సమావేశమయ్యారు. విద్యార్థులతో చర్చలు సానుకూల వాతావరణంలో జరిగాయని జార్ఖండ్ మంత్రి సుదివ్య కుమార్ వ్యాఖ్యానించారు. జెఎస్‌ఎస్‌సి - సిజెఎల్ పరీక్షకు సంబంధించిన అవకతవకలపై రిటైర్డ్ హైకోర్టు జడ్జి ఆధ్వర్యంలో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. నిందితులపై వేగంగా చర్యలు తీసుకునేందుకు ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయనున్నట్లు కూడా మంత్రి తెలిపారు. అయితే కేవలం హామీలతోనే సరిపెట్టకుండా, తమ డిమాండ్ల పరిష్కారానికి వెంటనే చర్యలు తీసుకోవాలని విద్యార్థి ప్రతినిధులు కోరారు. 'పోస్ట్ డేటెడ్ చెక్' వంటి భవిష్యత్తు హామీలు తమకొద్దని, స్పష్టమైన పరిష్కారం ఎప్పుడు వస్తుందో కావాలని పేర్కొన్నారు. జెపిఎస్‌సి పరీక్ష రద్దు డిమాండ్ నెరవేరిందని, అయితే సిబిఐ దర్యాప్తు జరపాలన్న తమ డిమాండ్‌పై స్పష్టమైన ప్రకటన వచ్చే వరకు ఆందోళనలు కొనసాగిస్తామని అన్నారు. ఈ నెల 10న జార్ఖండ్ అసెంబ్లీ దిశగా మార్చ్ నిర్వహించనున్నట్లు తెలిపారు. సిబిఐ దర్యాప్తు ప్రకటించే వరకు రాజీకి సిద్ధంగా లేమని తెలిపారు.








కామెంట్‌లు (0)