- దేశవ్యాప్తంగా విద్యార్థుల ఉద్యమం ఉధృతం
- మాక్రాన్ ప్రభుత్వానికి చెమటలు పట్టిస్తున్న హైస్కూల్ పిల్లలు
- నినాదాలతో మార్మోగిన పారిస్ నగరం
- ‘బ్లాక్ ట్యూస్డే’ పిలుపుతో వీధుల్లోకి లక్షలాది మంది
- మద్ధతు ప్రకటించిన కార్మిక సంఘాలు
పారిస్: పాఠశాలల్లో సిబ్బంది కొరత, శిథిలావస్థలో ఉన్న తరగతి గదులపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఫ్రాన్స్ వ్యాప్తంగా విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు మంగళవారం వీధుల్లోకి వచ్చారు. ఇప్పటివరకు జరిగిన నిరసనల్లో ఇదే అతిపెద్ద రోజుగా నిలిచింది. వందలాది పాఠశాలలను నిరసనకారులు దిగ్బంధించారు.
పారిస్లో భారీ ప్రదర్శన
మార్సెయిల్, నాంట్, లియోన్ నగరాల్లో ఉదయం శాంతియుతంగా ర్యాలీలు మొదలయ్యాయి. మధ్యాహ్నం పారిస్లో అతిపెద్ద ప్రదర్శన జరగనుంది. యువత పొగ బాంబులు పట్టుకుని, ‘మా పుస్తకాల కింద ఆగ్రహం ఉంది’’, ‘‘రాజకీయ నాయకులు ఎక్కడ? మేమున్నామని వారికి తెలుసా?’’ అని రాసిన ప్లకార్డులు ప్రదర్శించారు. పారిస్ శివారులోని వెనుకబడిన ప్రాంతాల్లో రెండు వారాల క్రితం మొదలైన ఈ ఉద్యమం దేశమంతా విస్తరించింది. నిరసనలను అణచివేసేందుకు ప్రభుత్వం అల్లర్ల నిరోధక పోలీసులను రంగంలోకి దించింది. ఉద్యమం హింసాయుతంగా మారిందంటూ ప్రభుత్వం ఆరోపిస్తోంది. ఉత్తర ఫ్రాన్స్లో సోమవారం హైస్కూల్ విద్యార్థులు, పోలీసుల మధ్య జరిగిన ఘర్షణల్లో ఓ టీనేజర్ చేయి తెగిపోయింది.
పాఠశాలల మూత...
హైస్కూల్ విద్యార్థుల సంఘం వెల్లడించిన వివరాల ప్రకారం, 1,800 పాఠశాలలను మూసివేశారు. కొన్ని స్థానిక విద్యా శాఖలు తరగతులను ఆన్లైన్కు మార్చే ప్రయత్నం చేశాయి. స్ట్రాస్బర్గ్కు చెందిన హైస్కూల్ విద్యార్థి హ్యూగో వెట్జెల్ మాట్లాడుతూ, ‘‘హింసే సమాధానమైతే, ప్రజాస్వామ్యం ఇక పనిచేయడం లేదని అర్థం. పాలక వర్గాలకు, మాకు మధ్య ఎంతో అంతరం ఉంది’’ అన్నారు.
అరెస్టులతో నిర్భందం...
నిరసనలు మొదలైనప్పటి నుంచి ఆరు వేల మందిని అరెస్టు చేసినట్లు అంతర్గత మంత్రిత్వ శాఖ తెలిపింది. వారిలో అత్యధికులు మైనర్లే కావడం గమనార్హం. 1,483 మంది మైనర్లు సహా 1,800 మందికి పైగా వ్యక్తులపై కేసులు నడుస్తున్నాయని న్యాయ శాఖ పేర్కొంది, అయితే ఏ నేరాలనేది వెల్లడించలేదు. ఘర్షణల్లో కనీసం 715 మంది పోలీసులు, 215 మంది టీనేజర్లు గాయపడ్డారని ప్రధాని కార్యాలయం తెలిపింది.
విద్యార్థులకు మద్దతుగా కార్మికలోకం..
ఈ ఉద్యమానికి కార్మిక సంఘాల మద్దతు కూడా పెరుగుతోంది. మంగళవారం నాటి ప్రదర్శనల్లో ‘‘సమ్మె రూపంలో సహా’’ పాల్గొనాలని సిజిటి కార్మిక సంఘాల సమాఖ్య నాయకత్వం కార్మికులకు పిలుపునిచ్చింది. సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ఢంగా ఉందా? లేదా? తేల్చాలని సిజిటి నేత సోఫీ బినెట్ ప్రశ్నించారు. కొన్ని కార్మిక సంఘాలు విద్యార్థు ఉద్యమానికి మద్ధతుగా సమ్మెకు పిలుపునిస్తున్నాయి. విశ్వవిద్యాలయ విద్యార్థులూ కూడా సంఘీభావంగా ప్రత్యక్షంగా పాల్గొన్నారు. అయితే, విద్యార్థులను వామపక్ష ‘‘ఫ్రాన్స్ అన్బౌడ్’’ (ఎల్ఎఫ్ఐ ) పార్టీ ఎంపీలు, మేయర్లు రెచ్చగొడుతున్నారని ప్రభుత్వం ఆరోపించింది. అయితే వామపక్ష పార్టీ ఈ ఆరోపణను ఖండించింది. ఎల్ఎఫ్ఐ పార్టీ నేత జీన్-లుక్ మెలాంషో ప్రభుత్వ స్పందనను అణచివేత చర్యగా విమర్శించారు. తాము హింసను వ్యతిరేకిస్తున్నామన్నారు. హైస్కూల్ విద్యార్థులపై అణిచివేత మానుకోవాలన్నారు. తక్షణం వారి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
సమస్యలు పరష్కరిస్తాం : ప్రధాని సెబాస్టియన్
విద్యార్థుల ఆందోళనతో ప్రధాని సెబాస్టియన్ లెకోర్ను ఎట్టకేలకు స్పందించారు. విద్యార్థుల ప్రధాన డిమాండ్లపై చర్యలు తీసుకోవాలని మంత్రులను ఆదేశించారు. గైర్హాజరైన ఉపాధ్యాయుల స్థానంలో ఇతరులను నియమించడం, ఉదయం 8 నుంచి సాయంత్రం 6 వరకు ఉండే పాఠశాల సమయాన్ని, భోజన విరామం పెంపు అవసరాన్ని సమీక్షించడం ఇందులో ఉన్నాయి. పాత పాఠశాల భవనాల మరమ్మతులనూ పరిశీలించాలన్నారు. అయితే, మాక్రాన్ కార్పొరేట్ విధానాలతో ఫ్రాన్స్ అప్పుల ఊబిలో కూరుకుపోయిందని, పెరిగిపోతున్న బడ్జెట్ లోటును తగ్గించుకునేందుకు ప్రయత్నిస్తున్న ప్రభుత్వంపై ఈ నిరసనలు మరింత ఒత్తిడి పెంచాయని. అప్పుల భారం, బలహీన వృద్ధి, యూరో విలువ పడిపోతోందని పలువురు విశ్లేషిస్తున్నారు.








కామెంట్లు (0)