- నౌకల్లో 22 మంది భారతీయలు
న్యూఢిల్లీ : సోమాలియా, యెమెన్ తీరాల్లో వేర్వేరు ఘటనల్లో రెండు కార్గో నౌకలు హైజాక్ అయ్యాయి. ఈ ఘటనల్లో మొత్తం 22 మంది భారతీయులు ఉన్నట్లు షిప్పింగ్ మంత్రిత్వ శాఖకు చెందిన ఒక సీనియర్ అధికారి శుక్రవారం తెలిపారు. అధికారిక వివరాల ప్రకారం.. ఎరిట్రియా జెండా కలిగిన 'ఎం టి సిబు 1' అనే చమురు ఉత్పత్తుల ట్యాంకర్‌ను ఆగస్టు 20న యెమెన్ తీరానికి సుమారు 30 నాటికల్ మైళ్ల దూరంలో ఉన్న ఏడెన్ గల్ఫ్‌లో సాయుధ సముద్రపు దొంగలు హైజాక్ చేశారు. ఈ నౌకలో 16 మంది భారతీయులు, ఒక సిరియా జాతీయుడు, ఒక సూడాన్ జాతీయుడు, ఒక ఇరాక్ జాతీయుడు, మరొక గుర్తింపు లేని నావికుడు సహా మొత్తం 20 మంది సిబ్బంది ఉన్నారు.
ప్రస్తుతం ఆరుగురు సాయుధ సముద్రపు దొంగలు నౌకలో ఉన్నారని, దానిని తమ నియంత్రణలోకి తీసుకున్నారని అధికారులు తెలిపారు. అలాగే తుర్కియే నుంచి సోమాలియా రాజధాని మొగడిషూకు వెళ్తున్న 'లుటుఫ్' అనే కార్గో నౌకను సముద్రపు దొంగలు హైజాక్ చేశారు. కామెరూన్ పతాకంతో ప్రయాణిస్తున్న ఈ నౌకలో మొత్తం 10 మంది సిబ్బంది ఉండగా, వారిలో ఆరుగురు భారతీయులు, మిగిలిన వారు తుర్కియే, జార్జియా, సెర్బియా దేశాలకు చెందినవారు ఉన్నారు. సోమాలియా తీరంలో సుమారు ఎనిమిది మంది దొంగలు ఈ నౌకను తమ ఆధీనంలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. నౌక వద్దకు ఓ చిన్న పడవ వచ్చి వెళ్లిన తర్వాత ఆ ప్రాంతంలో వైమానిక దాడి జరిగిందని, అయితే ఆ దాడి ఎవరు చేశారనే దానిపై స్పష్టత రావాల్సి ఉందని అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది.








కామెంట్‌లు (0)