బుధవారం, 14 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఎస్‌ఎఫ్‌ఐ పోరాటానికి సిజెపి మద్దతు

04 అక్టోబర్, 2026

sfi
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 05, 2026, 02:43 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

- జ్ఞానేష్‌ కుమార్‌ రాజీనామా చేయాలని డిమాండ్‌

- అక్టోబర్‌ 10న జంతర్‌మంతర్‌ వద్దకు విద్యార్థి, యువజన సంఘాల మార్చ్‌

ప్ర‌జాశ‌క్తి-న్యూఢిల్లీ బ్యూరో : ప్రధాన ఎన్నికల కమిషనర్‌ జ్ఞానేష్‌ కుమార్‌ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తూ ఎస్‌ఎఫ్‌ఐ, డివైఎఫ్‌ఐ చేపట్టిన పోరాటానికి కాక్రోచ్‌ జనతా పార్టీ (సిజెపి) మద్దతు ప్రకటించింది. యువత హక్కుల కోసం తొలి నుంచీ పోరాటాల్లో ముందుండే ఎస్‌ఎఫ్‌ఐ క్రమశిక్షణ, పోరాట పటిమను సిజెపి ప్రశంసించింది. విద్యార్థి, యువజన సంఘాల ఆందోళనకు సంఘీభావం తెలిపింది. ఈ సందర్భంగా సిజెపి కో కన్వీనర్‌ సౌరవ్‌ దాస్‌ మాట్లాడుతూ ''యువతర పోరాటాల్లో తొలి రోజు నుంచీ ఎస్‌ఎఫ్‌ఐ అగ్ర‌భాగాన ఉంది. ఆ సంఘం క్రమశిక్షణకు సాటిలేదు. మీరు లేవనెత్తిన డిమాండ్లకు మా సంపూర్ణ మద్దతు ఉంటుంది'' అని ప్రకటించారు. ప్రధాన ఎన్నికల కమిషనర్‌ జ్ఞానేష్‌ కుమార్‌ వ్యవహారశైలిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఆయన రాజీనామా చేయాలనే డిమాండ్‌తో వివిధ ప్రజాసంఘాలు, విద్యార్థి, యువజన సంఘాలు ఉద్యమాన్ని ఉధృతం చేస్తున్నాయి. ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత, ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ కోసం ఈ పోరాటం సాగుతోందని ఆయా సంఘాలు పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో అక్టోబర్‌ 10న ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్దకు భారీ మార్చ్‌ నిర్వహించాలని ఎస్‌ఎఫ్‌ఐ, డివైఎఫ్‌ఐ, సిజెపి తదితర సంఘాలు నిర్ణయించాయి. జ్ఞానేష్ కుమార్‌ రాజీనామా చేయాలనే ప్రధాన డిమాండ్‌తో చేపట్టనున్న ఈ ఆందోళనలో పెద్దఎత్తున విద్యార్థులు, యువత పాల్గొనాలని సంఘాలు పిలుపునిచ్చాయి.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్