బుధవారం, 29 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

ఎఫ్‌ఐఆర్‌ల ఉపసంహరణపై కేంద్రం లిఖితపూర్వక హామీ ఇవ్వలేదు: సిజెపి

9 గంటల క్రితం

cjp
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 29, 2026, 12:24 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

న్యూఢిల్లీ : విద్యార్థులు,ఆందోళనకారులపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌లను ఉపసంహరించుకోవడంతో పాటు, భవిష్యత్తులో శాంతియుత నిరసనల్లో పాల్గొనే వారిపై ఎలాంటి చర్యలు తీసుకోబోమని కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు లిఖితపూర్వక హామీ ఇవ్వలేదని కాక్రోచ్ జనతా పార్టీ (సిజెపి) పేర్కొంది. సిజెపి ప్రధాన ప్రతినిధి సౌరవ్ దాస్ మంగళవారం సాయంత్రం విడుదల చేసిన ప్రకటనలో, కేంద్ర ప్రభుత్వ ప్రతినిధుల ఆహ్వానం మేరకు వారితో సమావేశమైనట్లు తెలిపారు. సమావేశంలో దేశవ్యాప్తంగా విద్యార్థి నిరసనల సందర్భంగా నమోదైన ఎఫ్‌ఐఆర్‌లకు సంబంధించిన అంశంపై విస్తృతంగా చర్చించినట్లు చెప్పారు. కేంద్ర ప్రభుత్వం తమకు సుప్రీంకోర్టు జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులను, ముఖ్యంగా ‘డైరెక్షన్ నంబర్–4'ను చూపించిందని దాస్ తెలిపారు. ప్రస్తుతం నమోదైన ఎఫ్‌ఐఆర్‌లపై దర్యాప్తు కొనసాగించేందుకు సుప్రీంకోర్టు అనుమతించిన నేపథ్యంలో, ఈ వ్యవహారం కోర్టు పరిధిలో ఉన్నందున లిఖితపూర్వక హామీ ఇవ్వడం సాధ్యం కాదని కేంద్రం పేర్కొన్నట్లు వెల్లడించారు. అయితే, ఎఫ్‌ఐఆర్‌ల ఉపసంహరణపై స్పష్టమైన లిఖితపూర్వక హామీ ఇవ్వాలని తాము ప్రభుత్వాన్ని కోరినప్పటికీ, ఇప్పటివరకు ఎలాంటి అధికారిక స్పందన రాలేదని దాస్ తెలిపారు. ఈ అంశం కేవలం ఢిల్లీకి మాత్రమే కాకుండా, బీజేపీ లేదా ఎన్‌డీఏ పాలిత అన్ని రాష్ట్రాలకు వర్తించేలా హామీ ఇవ్వాలని తాము కోరినట్లు చెప్పారు.


దేశ యువతకు కేంద్రం ద్రోహం

దేశ యువత ప్రయోజనాల విషయంలో కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా విఫలమైందని సౌరవ్ దాస్ విమర్శించారు. లిఖితపూర్వక హామీ ఇవ్వాలని మంగళవారం వరకు గడువు విధించినప్పటికీ, ప్రభుత్వం స్పందించలేదని ఆయన అన్నారు. సిజెపి డిమాండ్లకు విరుద్ధంగా తీసుకునే ఎలాంటి నిర్ణయాన్నీ తమ పార్టీ అంగీకరించదని స్పష్టం చేశారు. విద్యార్థులకు ఇచ్చిన హామీలను కేంద్రం తప్పనిసరిగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఒకవేళ ప్రభుత్వం హామీలను అమలు చేయడంలో విఫలమైతే, దేశవ్యాప్తంగా మరో విడత ఉద్యమాన్ని ప్రారంభిస్తామని హెచ్చరించారు. విద్యార్థుల హక్కులు, ప్రయోజనాల పరిరక్షణకు తమ పార్టీ కట్టుబడి ఉంటుందని ఆయన పేర్కొన్నారు.


సుప్రీంకోర్టును రాజకీయ ప్రయోజనాలకు వినియోగించవద్దు: సిజెపి

దేశవ్యాప్త విద్యార్థి నిరసనల సందర్భంగా నమోదైన ఎఫ్‌ఐఆర్‌లపై దర్యాప్తు కొనసాగించేందుకు సుప్రీంకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులపై కూడా సౌరవ్ దాస్ స్పందించారు. కోర్టు విధించిన కొన్ని షరతులు తమ పార్టీకి ఆమోదయోగ్యం కాదని ఆయన తెలిపారు.

కేంద్ర ప్రభుత్వ రాజకీయ ప్రయోజనాల కోసం సుప్రీంకోర్టు పేరును ఉపయోగించకూడదని, నిరసనకారులను లక్ష్యంగా చేసుకునేందుకు కోర్టు ఉత్తర్వులను సాకుగా చూపరాదని ఆయన అన్నారు. నేరాలకు పాల్పడిన వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం ప్రభుత్వ బాధ్యతేనని, అవసరమైతే వారి బెయిల్‌ను రద్దు చేయాలని కోర్టును పోలీసులు కోరవచ్చని పేర్కొన్నారు. అయితే, శాంతియుత నిరసనల్లో పాల్గొన్న విద్యార్థులు, ఆందోళనకారులపై చర్యలు తీసుకోవడానికి అదే కారణాన్ని ఉపయోగించడం సమంజసం కాదని సౌరవ్ దాస్ అభిప్రాయపడ్డారు.

సుప్రీంకోర్టు ఆదేశాల అమలు పేరుతో ప్రజాస్వామ్య హక్కులను అణచివేయడానికి ప్రభుత్వం ప్రయత్నించకూడదని, విద్యార్థుల ఆందోళనలను చట్టపరమైన కేసులతో అణిచివేయాలనే ధోరణిని వెంటనే విరమించుకోవాలని సిజెపి డిమాండ్ చేసింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్