ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : 2021 నుండి 2026 వరకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 77 దేశాల్లో పర్యటించి, ప్రజా ఖజానా నుండి రూ. 557.51 కోట్లు ఖర్చు చేశారని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. రాజ్యసభలో సిపిఎం ఎంపి వి. శివదాసన్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి పవిత్ర మార్గరీట ఈ విషయాన్ని వెల్లడించారు.
2021 నుండి పర్యటించిన దేశాలు మరియు ఖర్చు చేసిన మొత్తం-2021: నాలుగు దేశాలు, రూ. 36.12 కోట్లు, 2022లో 10 దేశాలు, రూ. 55.83 కోట్లు, 2023లో 11 దేశాలు, రూ. 93.63 కోట్లు, 2024లో 17 దేశాలు, రూ. 109.51 కోట్లు, 2025లో 23 దేశాలు, రూ. 187.83 కోట్లు, 2026లో ఇప్పటివరకు 12 దేశాలు, రూ. 74.59 కోట్లు ఖర్చు చేశారు. మోడీ విదేశీ పర్యటనల కోసం సంవత్సరానికి సగటున రూ. 92.92 కోట్లు ఖర్చు చేశారు.
పరిశోధనకు అరకొరగా..
కాగా గత ఐదేళ్లలో పరిశోధన అండ్ అభివృద్ధి కోసం అరకొరగా కేటాయించిన రూ.694.72 కోట్ల నిధులను కూడా సక్రమంగా వినియోగించలేదు. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వమే సభలో ప్రకటించింది. రాజ్యసభలో ఎంపి వి. శివదాసన్ అడిగిన ప్రశ్నలకు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ సమాధానం ఇచ్చారు. దేశం తన జిడిపిలో కేవలం 0.41 శాతం మాత్రమే పరిశోధన అండ్ అభివృద్ధి కోసం ఖర్చు చేస్తోందని తెలిపారు. గత ఐదేళ్లలో 2021-22లో రూ.152 కోట్లు, 2022-23లో రూ.250 కోట్లు, 2023-24లో రూ.118 కోట్లు, 2024-25లో రూ.130.73 కోట్లు, 2025-26లో రూ.44.87 కోట్లు వినియోగించలేదని తెలిపారు. దీంతో మొత్తం వినియోగించని కేటాయింపుల విలువ ₹694.72 కోట్లకు చేరింది.








కామెంట్‌లు (0)