శుక్రవారం, 28 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

దళితుడిపై గోగూండాల దాడి.. ఆలస్యంగా వెలుగులోకి

2 గంటల క్రితం

Cow vigilantes
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 28, 2026, 11:46 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

బలవంతంగా ఆవుపేడ తినిపించిన వైనం

ముంబయి : మహారాష్ట్రలోని జల్నాలో దళిత వ్యక్తిపై గోగూండాలు దాడికి పాల్పడి, బలవంతంగా ఆవుపేడ తినిపించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎద్దును కబేళాకు విక్రయించేందుకు తీసుకెళ్తున్నారనే ఆరోపణతో బజరంగ్‌ దళ్‌ సభ్యులు పరమేశ్వర్‌ సుహాస్‌ హివాలేపై దాడి చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో బాధితుడు ఈ నెల ఆగస్టు 21న పోలీసులను ఆశ్రయించారు. మే 23న ఈ ఘటన జరిగినప్పటికీ.. పోలీసులు ఎవరినీ అదుపులోకి తీసుకోలేదు.


వివరాల ప్రకారం.. పరమేశ్వర్‌ సుహాస్‌ దేవుల్‌గావ్‌ రాజాలో పశువుల సంతలో కొనుగోలు చేసిన ఎద్దును తీసుకుని 11 ఏళ్ల కుమారుడు, నారాయణ్‌ మారోతి కాంబ్లేతో కలిసి జల్నాకు తిరిగి వస్తున్నాడు. గోరక్ష‍కులుగా పేర్కొంటూ బజరంగ్‌ దళ్‌ సభ్యులు కన్హయ్యనగర్‌ వద్ద వారి వాహనాన్ని అడ్డుకున్నారు. కొనుగోలుకు సంబంధించిన పత్రాలు చూపించినప్పటికీ పరమేశ్వర్‌ సుహాస్‌ను చెంపదెబ్బలు కొట్టి, పేరు, కులం అడిగి కులపరమైన దూషణలకు పాల్పడ్డారు. అనంతరం పరమేశ్వర్‌ నోటిలో బలవంతంగా ఆవుపేడ కుక్కారు. 11 ఏళ్ల కుమారుడికి కూడా ఆవు పేడ నోటిలో కుక్కేందుకు యత్నించారు. కాంబ్లేపై కూడా దాడి చేసి, వాహనాన్ని ధ్వంసం చేశారు. ఈ ఘటనను వీడియో తీసిన నిందితులు పోలీసులకు ఫిర్యాదు చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని బెదిరించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఆరుగురు నిందితులపై బిఎన్‌ఎస్‌లోని పలు సెక్షన్లతో పాటు ఎస్సీ, ఎస్టీ (అత్యాచారాల నిరోధక) చట్టం కింద కేసు నమోదు చేశారు. అయితే ఇప్పటివరకు ఎవరినీ అరెస్టు చేయలేదు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్