- క్యూబాకు సంఘీభావంగా పెద్ద మొత్తంలో ఔషధాల సేకరణ
న్యూఢిల్లీ : క్యూబా విప్లవ నేత ఫైడల్ కాస్ర్టో శత జయంతి ఉత్సవాల్లో పాల్గొనేందుకు సిపిఎం ప్రతినిధి బృందం ఆదివారం క్యూబా బయలుదేరి వెళ్ళింది. హవానాలోని కన్వెన్షన్ ప్యాలస్‌లో ఈ నెల 10 నుండి 13 వరకు ఈ కార్యక్రమం జరగనుంది. ఏడాది పొడవునా జరిగిన క్యూబా కమాండర్ ఇన్ చీఫ్ ఫైడల్ కాస్ర్టో రూజ్ శత జయంతి ఉత్సవాల ముగింపు కార్యక్రమంగా ‘ఫైడల్ : వారసత్వం, భవిష్యత్’’ అన్న అంశంపై అంతర్జాతీయ సదస్సు జరగనుంది. ఆ సదస్సులో పాల్గొనడంతో పాటూ ప్రతినిధి బృందం క్యూబాలోని కార్డియాక్ ఆస్పత్రిని, చిన్నారుల కేన్సర్ ఆస్పత్రిని కూడా సందర్శించనుంది. అణగారిన వర్గాల కోసం చేపట్టిన సామాజిక పథకమైన కార్మిక-రైతు సహకార సంఘాలను కూడా సిపిఎం ప్రతినిధి బృందం పరిశీలించనుంది. అలాగే ఫైడల్ కాస్ట్రో సెంటర్, చెగువేరా సెంటర్, క్యూబా విప్లవంతో ముడిపడిన చార్రితక ప్రదేశాలను కూడా ఈ బృందం సందర్శించనుంది. ఈ నెల 19న భారత్‌కు తిరిగి వస్తారు. కేన్సర్, గుండె సంబంధిత వ్యాధులు, ఇతర ప్రాణాంతక వ్యాధుల చికిత్సకు అవసరమైన ఔషధాలను పెద్ద మొత్తంలో ఈ ప్రతినిధి బృందం తీసుకెళుతోంది. క్యూబన్లకు సంఘీభావంగా సిపిఎం, సిపిఐలు ఈ మందులను సేకరించాయి. అమెరికా సామ్రాజ్యవాద దురహంకార ప్రభుత్వం అక్రమంగా అమలు చేస్తున్న ఆంక్షలతో క్యూబా తీవ్రమైన మానవతావాద సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. క్యూబాకు, కూబా ప్రజలకు అంతర్జాతీయ సంఘీభావాన్ని పునరుద్ధరించడానికి, మరింత బలోపేతం చేయడానికి ఫైడల్ కాస్ర్టో శత జయంతి కూడా ముఖ్యమైన సందర్భంగా వుంది. సిపిఎం ప్రతినిధి బృందంలో పొలిట్‌బ్యూరో సభ్యులు విజూ కృష్ణన్, కేంద్ర కమిటీ సభ్యురాలు పి.కె.శ్రీమతి, కర్ణాటక రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు మీనాక్షి సుందరం, ఛత్తీస్‌ఘడ్ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ధర్మరాజ్ మహాపాత్ర, కేరళ రాష్ట్ర కమిటీ సభ్యులు ఎన్.చంద్రన్, వ్యవసాయ సబ్ కమిటీ సభ్యులు బి.వెంకట్, సెంట్రల్ ట్రేడ్ యూనియన్ ఫ్రాక్షన్ మెంబర్ అనీల్ ఎస్‌ఎస్ వున్నారు. క్యూబా డిప్యూటీ రాయబారి రెగ్లా ఫ్రామెటా గోమెజ్ న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆ ప్రతినిధి బృంద సభ్యులకు వీడ్కోలు పలికారు.








కామెంట్‌లు (0)