న్యూఢిల్లీ : దేశంలో సైబర్ నేరాలు మూడు రెట్లు పెరిగాయని కేంద్ర ప్రభుత్వం బుధవారం పార్లమెంట్‌కు తెలియచేసింది. 2020లో సైబర్ మోసాల సంఖ్య 10,395 వుండగా, 2024నాటికి ఈ సంఖ్య 29,758కి పెరిగిందని పేర్కొంది. గతేడాదిలో తెలంగాణాలో ఈ నేరాలు ఎక్కువగా నమోదయ్యాయి. 2024లో గుర్తించిన కేటగిరీల్లో ఆన్‌లైన్ బ్యాంకింగ్ మోసం ప్రధానంగా వుంది. ఈ కేటగిరీ కింద 4659 కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత స్థానంలో క్రెడిట్ కార్డ్ లేదా డెబిట్ కార్డ్ మోసాలు వున్నాయి. ఇక వరుసగా మార్కెటింగ్ లేదా పెట్టుబడుల మోసాలు (3044), ఎటిఎం మోసం (1659), మోసపూరిత కాల్ (1264), గేమింగ్ యాప్ లేదా వెబ్‌సైట్ మోసాలు (1019), ఒటిపి మోసాలు(965), ఇ వాలెట్ లేదా యుపిఐ మోసాలు (723) వున్నాయి. రాష్ట్రాలవారీగా చూసినట్లైతే తెలంగాణాలో 2024లో రికార్డు స్థాయిలో ఈ తరహా కేసులు 18,922 నమోదయ్యాయి. ఆ తర్వాత స్థానాల్లో బీహార్ (4020), మహారాష్ట్ర (2827), ఒరిస్సా (1546) వున్నాయి. అయితే ఈ కేసుల్లో ఎంత మొత్తం డబ్బు నష్టపోయారు లేదా రికవరీ చేసారనే వివరాలకు సంబంధించిన డేటాను జాతీయ నేర గణాంకాల బ్యూరో (ఎన్‌సిఆర్‌బి) రూపొందించలేదని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ రాజ్యసభలో రాతపూర్వక సమాధానంలో తెలిపారు.








కామెంట్‌లు (0)