- వరద ప్రభావంలోనే రెండు లక్షలు మంది
- అస్సాం వరదలు
గౌహతి : వర్షాలు, వరదలు కారణంగా అస్సాంలో మరణించిన వారి సంఖ్య 82కు చేరుకుంది. ఇంకా సుమారు రెండు లక్షల మంది వరద ప్రభావంలోనే చిక్కుకుని ఉన్నారు. రాష్ర్టవ్యాప్తంగా ఉన్న 54 పునరావస కేంద్రాల్లో దాదాపు 13 వేల మంది ఆశ్రయం పొందుతున్నారు. రాష్ర్టంలో వివిధ ప్రాంతాల్లోని 26 సహాయ పంపిణీ కేంద్రాల ద్వారా 5,400 మందికి సాయం అందిస్తున్నారు. ఈ వివరాలను అస్సాం అధికారులు వెల్లడించారు. జులై 31 నుంచి అస్సాంపై వరద ప్రభావం తగ్గుతూ వస్తోంది తెలిపారు. అయినా ఇంకా శివసాగర్, గోలాఘాట్, జోర్హాట్, నాగావ్, చరాయిదేవ్ జిల్లాలో పరిస్థితి తీవ్రంగానే ఉన్నట్లు చెప్పారు. ముఖ్యంగా దిఖో, ధన్‌సిరి నదులు "తీవ్ర వరద పరిస్థితి"లో ఉన్నాయని ఈ నదీ పరివాహక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. అలాగే, ముమ్మరంగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయని, ఎన్‌డిఆర్‌ఎఫ్, ఎస్‌డిఆర్‌ఎఫ్‌లతో సహా పలు సంస్థలు ఇందులో పాల్గొంటున్నాయని అధికారులు వెల్లడించారు. అస్సాంలో జులై మొదటి వారం నుంచి భారీ స్థాయిలో వర్షాలు, వరదలు విజృంభించిన సంగతి తెలిసిందే. గత 60 ఏళ్లలో ఇదే అత్యంత దారుణమైన పరిస్థితి అని అస్సాం ప్రభుత్వం జూలై 23న అసెంబ్లీకి తెలిపింది. రాష్ర్టంలోని ఎనిమిది జిల్లాలోని 7.21 లక్షల మంది ప్రజలు వరద ప్రభావానికి గురయ్యాయి.ముఖ్యంగా చరాయిదేవ్, జోర్హాట్, శివసాగర్ అనే మూడు జిల్లాలు తీవ్ర నష్టాన్ని చవిచూశాయి.








కామెంట్‌లు (0)