మంగళవారం, 06 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

సాంస్కృతిక సభపై ఢిల్లీ పోలీసుల దాడి

3 గంటల క్రితం

sfi
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 06, 2026, 11:49 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

- ఎస్‌ఎఫ్‌ఐ జాతీయ అధ్యక్షులు సహా పలువురి నిర్బంధం

- విద్యార్థినులకు గాయాలు

- పోలీసులతో కలిసి ఆర్‌ఎస్ఎస్‌ గూండాలూ దాడి

- ఖండించిన ఎస్ఎఫ్‌ఐ కేంద్ర కమిటీ

న్యూఢిల్లీ : ప్రధాన ఎన్నికల కమిషనర్ (సిఇసి) జ్ఞానేష్ కుమార్ రాజీనామాను డిమాండ్ చేస్తూ కన్నాట్ ప్లేస్‌లో మంగళవారం జరిగిన సాంస్కృతిక సభపై ఢిల్లీ పోలీసులు దాడి చేశారు. శాంతియుతంగా నిర్వహిస్తున్న సభను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఈ సభలో ఉన్న భారత విద్యార్థి ఫెడరేషన్‌ (ఎస్‌ఎఫ్‌ఐ) అధ్యక్షులు ఆదర్శ్ ఎం సాజీ, ఇతర విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకుని రహస్య ప్రాంతానికి తరలించారు. అయితే వారిని అరెస్టు చేస్తున్న సమయంలో ఆర్‌ఎస్‌ఎస్‌ ‌గూండాలు దాడి చేశారని, పోలీసుల ప్రోద్బలంతోనే వారు దాడికి తెగబడ్డారని ఎస్‌ఎఫ్‌ఐ నేతలు మీడియాకు తెలిపారు. అలాగే, అరెస్టు చేసిన వారి ఆచూకీ తెలపాలని కోరినా పోలీసులు స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఢిల్లీ పోలీసుల దాడిని ఎస్‌ఎఫ్‌ఐ కేంద్ర కమిటీ తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు ఎస్‌ఎఫ్‌ఐ అఖిల భారత ప్రధాన కార్యదర్శి శ్రీజన్ భట్టాచార్య ప్రకటన విడుదల చేశారు. సిఇసి జ్ఞానేష్ కుమార్ రాజీనామా కోరుతూ ఎస్‌ఎఫ్‌ఐ, ప్రగతిశీల సాంస్కృతిక కళాకారుల వేదిక ‘దస్తక్’ కలిసి ఈ సభను నిర్వహిస్తున్నాయని, జన నాట్య మంచ్, దస్తక్ సభ్యులు పాటలు పాడుతూ ఎన్నికల జవాబుదారీతనం కోసం గళమెత్తుతుండగా పోలీసులు సభను బలవంతంగా అడ్డుకున్నారని ఆయన తెలిపారు. ఎస్‌ఎఫ్‌ఐ జాతీయ అధ్యక్షులు ఆదర్శ్ ఎం సాజీ, ఢిల్లీ రాష్ట్ర కార్యదర్శి సూరజ్ ఎలమోన్ సహా పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారన్నారు. మొత్తం 15 మంది కార్యకర్తలు నిర్బంధంలో ఉన్నారని, పోలీసులు దుర్మార్గంగా బలప్రయోగం చేశారని, మహిళా కార్యకర్తలను వేధించి, దాడి చేశారని, పలువురికి గాయాలయ్యాయని తెలిపారు. అయితే, పోలీసులు అరెస్టు చేస్తున్న సమయంలోనే ఎస్‌ఎఫ్‌ఐ నాయకులపై ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్తలు దాడి చేయడాన్ని ఖండించారు. వారిని ఎవరు అనుమతించారని పోలీసులను ప్రశ్నించారు. బెదిరింపులు, నిర్బంధాలు, హింసతో విద్యార్థుల, యువత ప్రజాస్వామ్య గళాన్ని అణచలేరన్నారు. ఎన్నికల జవాబుదారీతనం, ప్రజాస్వామ్య హక్కులు, రాజ్యాంగ పరిరక్షణ కోసం పోరాటంలో ఒక్క అడుగు కూడా వెనక్కి తగ్గబోమని శ్రీజన్ స్పష్టం చేశారు.

​విద్యార్థులను విడుదల ‌చేయాలి : ఐషే ఘోష్

కన్నాట్ ప్లేస్ నుంచి మాట్లాడిన ఎస్‌ఎఫ్‌ఐ అఖిల భారత సంయుక్త కార్యదర్శి ఐషే ఘోష్... మహిళా విద్యార్థులు, కార్యకర్తలపై పోలీసులు దురుసుగా ప్రవర్తించి, దాడి చేశారని ఆరోపించారు. మహిళా కార్యకర్తలను ఈడ్చుకెళ్లారని ఆమె ఎక్స్‌లో పేర్కొన్నారు. నిర్బంధించిన వారిని పోలీసులు ఎక్కడికో తెలియని ప్రదేశాలకు తరలించారని, వారి ఆచూకీని సహచరులకు, కుటుంబ సభ్యులకు వెంటనే తెలియజేయాలని డిమాండ్ చేశారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్