- లైంగిక వేధింపులకు పాల్పడ్డ పోలీసులపై చర్యకు మహిళాసంఘాల డిమాండ్
- ఫొటోలు తీసుకుని వెళ్లిపోవాలంటూ డిసిపి అవహేళన
- మహిళా నేతల ఆగ్రహం
- డిసిపి క్షమాపణ
ప్రజాశక్తి – న్యూఢిల్లీ బ్యూరో : ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్కు వ్యతిరేకంగా జరిగిన ఆందోళనల సందర్భంగా మహిళలు, ట్రాన్స్జెండర్లపై పోలీసులు లైంగిక వేధింపులకు పాల్పడ్డారని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఐద్వా, ఎన్ఎఫ్ఐడబ్ల్యు, ఎఐపిడబ్ల్యూఎ తదితర సంఘాలు ఢిల్లీ పోలీసు ప్రధాన కార్యాలయాన్ని ముట్టడించాయి. ప్లకార్డులు చేబూని నినాదాలు చేశారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న వారిపై క్రూరమైన అణచివేతను, బహిరంగ ప్రదేశాలు, పోలీసు వాహనాలు, నిర్బంధ కేంద్రాల్లో లైంగిక వేధింపులు, దాడులను నేతలు ఖండించారు. మాటలతో దూషించడం, అవమానించడం, శారీరక హింసకు పాల్పడటం ద్వారా మహిళలను లక్ష్యంగా చేసుకున్నవారిపై చర్యలు తీసుకోవాల్సిందేనని స్పష్టం చేశారు. ఈ సమయంలో కార్యాలయం బయటకు వచ్చిన డిప్యూటీ పోలీస్ కమిషనర్ (డిసిపి), నిరసనకారులు ఫొటోలు తీసుకుని వెళ్లిపోవచ్చంటూ అవహేళన చేశారు. దీంతో నేతలు నిరసనను మరింత ఉధృతం చేశారు. దిగివచ్చిన డిసిపి తన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పారు. అనంతరం మహిళా సంఘాల నేతలు ఘటనలపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులైన పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు. లైంగిక వేధింపులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటామని డిసిపి హామీ ఇచ్చారు. ప్రజాస్వామ్య స్వేచ్ఛలను, శాంతియుతంగా నిరసన తెలిపే రాజ్యాంగ హక్కును పరిరక్షించాలని, మహిళల గొంతు నొక్కే ప్రయత్నాలను, వారిని ప్రజా, రాజకీయ జీవితం నుంచి దూరం చేసే యత్నాలను ప్రతిఘటించాలని మహిళా సంఘాలు సంయుక్తంగా ఐక్య పోరాటాలకు పిలుపునిచ్చాయి. ఈ కార్యక్రమానికి ఐద్వా అధ్యక్షురాలు పి.కె. శ్రీమతి టీచర్, ఉపాధ్యక్షురాలు మరియం ధావలే, సిఐటియు అనుబంధ వర్కింగ్ ఉమెన్ కోఆర్డినేషన్ కమిటీ కన్వీనర్ ఎఆర్ సింధు, ఎన్ఎఫ్ఐడబ్ల్యు నాయకురాలు ఆనీ రాజా, ఎఐపిడబ్ల్యూఎ జాతీయ కార్యదర్శి శ్వేతా రాజ్ తదితరులు నాయకత్వం వహించారు. ఎస్ఎఫ్ఐ ఢిల్లీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మెహినా ఫాతిమా నేతృత్వంలో విద్యార్థినులు, ఎస్ఎఫ్ఐ కార్యకర్తలు కూడా హాజరయ్యారు.








కామెంట్లు (0)