- ఏడాదిలో లక్ష మందికి పైగా వేధించేవారిని గుర్తింపు
- మారువేషాల్లో ఢిల్లీ మహిళా పోలీసుల నిఘా
న్యూఢిల్లీ: మహిళలపై వేధింపులు, లైంగిక దాడులు, ఇతర నేరాలకు అడ్డుకట్ట వేసేందుకు ఢిల్లీ పోలీసులు చేపట్టిన ప్రత్యేక చర్యల్లో ఏడాది కాలంలో 1.05 లక్షల మందికి పైగా అదుపులోకి తీసుకున్నారు. ‘శిక్షాచార్’ బృందాలు బహిరంగ ప్రదేశాల్లో మారువేషాల్లో నిఘా పెట్టి నేరాలకు పాల్పడుతున్న వారిని గుర్తిస్తున్నాయి. 2025 మార్చిలో ప్రారంభమైన ఈ కార్యక్రమం ద్వారా ఇప్పటివరకు 15,077 దాడులు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. 2025లో 10,449 దాడుల్లో 65,615 మందిని అదుపులోకి తీసుకోగా, ఈ ఏడాది ఇప్పటివరకు 4,628 దాడుల్లో మరో 40,015 మందిని అదుపులోకి తీసుకున్నారు. దీంతో మొత్తం సంఖ్య 1,05,630కు చేరింది. ఢిల్లీ వ్యాప్తంగా 30 శిక్షాచార్ బృందాలు పనిచేస్తున్నాయి. ఒక్కో బృందంలో ఒక ఇన్‌స్పెక్టర్, ఒక సబ్ ఇన్‌స్పెక్టర్, నలుగురు మహిళా పోలీసులు, ఐదుగురు పురుష పోలీసులు ఉంటారు. అవసరాన్ని బట్టి స్పెషల్ స్టాఫ్ లేదా యాంటీ ఆటో థెఫ్ట్ స్క్వాడ్ సిబ్బంది సాంకేతిక సహాయం అందిస్తారు. మహిళా పోలీసులు సాదా దుస్తుల్లో నిఘా నిర్వహిస్తూ వేధింపులకు పాల్పడుతున్న వారిని గుర్తిస్తున్నారు. పాఠశాలలు, కళాశాలలు, మాల్స్ వంటి రద్దీ ప్రాంతాలతో పాటు ఏకాంతంగా, తక్కువ వెలుతురు ఉన్న ప్రాంతాల్లోనూ ఈ బృందాలు తనిఖీలు నిర్వహిస్తున్నాయి. మహిళలను వేధించడం, అసభ్యకర వ్యాఖ్యలు చేయడం, అనుమతి లేకుండా వీడియోలు చిత్రీకరించడం, అనుమానాస్పదంగా సంచరించడం, గొడవలకు పాల్పడటం వంటి చర్యలపై ప్రత్యేకంగా నిఘా పెడుతున్నారు. సాదా దుస్తుల్లో ఉన్న మహిళా పోలీసులు బస్సుల్లో ప్రయాణిస్తూ కూడా నిఘా నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. కొందరు వ్యక్తులు మహిళా పోలీసులను సాధారణ ప్రయాణికులుగా భావించి అసభ్యంగా ప్రవర్తించిన సందర్భాల్లో వారిని వెంటనే అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు.
ఈ ఆపరేషన్లు సమాచారం, క్షేత్రస్థాయి నిఘా, ప్రత్యక్ష పరిశీలన, గత ఫిర్యాదుల ఆధారంగా గుర్తించిన నేర నమూనాలపై నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. సాధారణ కేసుల్లో నిందితులను పోలీస్ స్టేషన్‌కు తరలించి డైలీ డైరీ లేదా జనరల్ డైరీలో నమోదు చేసి, కుటుంబ సభ్యుల సమక్షంలో కౌన్సెలింగ్ ఇచ్చి హెచ్చరికతో వదిలేస్తున్నారు. తీవ్రమైన లైంగిక వేధింపులు లేదా లైంగిక దాడి కేసుల్లో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మహిళలు బహిరంగ ప్రదేశాల్లో సురక్షితంగా ఉన్నామనే నమ్మకాన్ని కల్పించడమే ఈ ప్రత్యేక బృందాల ప్రధాన లక్ష్యమని అధికారులు తెలిపారు.








కామెంట్‌లు (0)