- కారును ఢీకొన్న రైలు
- నలుగురు చిన్నారులతో సహా ఐదుగురి మృతి
- మరో నలుగురికి తీవ్ర గాయాలు
కొల్‌కతా : పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్ జిల్లాలో శుక్రవారం ఘోర ప్రమాదం సంభవించింది. పాఠశాల విద్యార్థులతో వెళుతున్న కారును రైలు ఢీకొట్టడంతో నలుగురు చిన్నారులతో సహా ఐదుగురు మృతి చెందారు. మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. ముర్షిదాబాద్ జిల్లాలోని బెహ్రంపూర్ ప్రాంతంలో ఉన్న కర్ణ సుబర్ణ రైల్వే స్టేషన్ సమీపంలోని రైల్వే లెవెల్ క్రాసింగ్ వద్ద శుక్రవారం ఉదయం లెవెల్ క్రాసింగ్‌ను దాటేందుకు కారు ప్రయత్నిస్తుండగా రైలు దానిని బలంగా ఢీకొట్టింది. దీంతో ఇద్దరు చిన్నారులతో సహా ముగ్గురు అక్కడికక్కడే మరణించగా, ముర్షిదాబాద్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ మరో ఇద్దరు విద్యార్థులు మరణించారు. గాయపడిన కారు డ్రైవర్ కూడా ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం ‘క్రాసింగ్ వద్ద ఒక రైలు వెళ్లిపోగా గేట్‌మెన్ గేట్లు తెరిచాడు. దీంతో కొన్ని కార్లు, జనం గేటు దాటడం మొదలుపెట్టారు. సరిగ్గా అదే సమయంలో మరో రైలు అతివేగంగా దూసుకొచ్చింది. వీరిని ఢీకొట్టింది’. ‘ షెడ్యూల్ ప్రకారం మరో రైలు ఉందని గేట్‌మెన్‌కు ఎందుకు తెలియలేదు?’ అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. రైల్ గేట్‌మన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు చొప్పున, గాయపడిన ప్రతి ఒక్కరికీ రూ.2.5 లక్షల చొప్పున పరిహారం అందజేస్తామని రైల్వే శాఖ ప్రకటించింది.








కామెంట్‌లు (0)