ఆదివారం, 13 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ప్రముఖులకు ఇసి నోటీసులు

2 రోజుల క్రితం

kk
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 11, 2026, 01:07 పూర్వాహ్నం | 3 నిమిషాల చదవడం

- పెరుగుతున్న ఎస్‌ఐఆర్‌ వ్యత్యాసాల జాబితా

- తాజాగా నందన్‌ నీలేకని. శివరాజ్‌ కుమార్‌, కామత్‌ సోదరులు, హజబ్బ, కర్ణాటక సిఎం తల్లి

ఢిల్లీ : కర్ణాటకలో ప్రస్తుతం కొనసాగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌)‌లో భాగంగా ఎన్నికల కమిషన్‌ ‌ప్రచురించిన వ్యత్యాసాల జాబితాలో అనేకమంది ప్రముఖులు ఉన్నారు. ఇప్పటికే భారతరత్న గ్రహీత, ప్రముఖ శాస్త్రవేత్త సిఎన్‌ఆర్‌ రావు పేరు ఉండటం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. తాజాగా ఆ జాబితాలో ఇన్ఫోసిప్‌ ‌సహ వ్యవస్థాపకుడు నందన్‌ ‌నీలేకని, ఆయన భార్య, రచయిత్రి, వితరణశీలి రోహిణి నీలేకని, కుమారుడు, నీహార్‌ ‌నీలేకరి, కుమార్తె జాహ్నవి నీలేకని, కర్ణాటక సిఎం గౌరమ్మ తదితరుల పేర్లు వున్నాయి. ప్రముఖ కన్నడ నటుడు శివరాజ్‌‌కుమార్‌, జెరొదా వ్యవస్థాపకులు నిఖిల్‌ ‌కామత్‌, నితిన్‌ ‌కామత్‌, పద్మశ్రీ అవార్డు గ్రహీత, సామాజిక కార్యకర్త హరేకళ హజబ్బ పేర్లు కూడా ఈ జాబితాలో ఉన్నాయి. నీలేకని కుటుంబ సభ్యుల కేసులో ‘చివరి ఎస్‌ఐఆర్‌‌తో మ్యాపింగ్‌ ‌(అనుసంధానించడం) కావడం లేదు’ అనేది ఇందుకు కారణంగా పేర్కొన్నారు. 2002 నాటి నమోదు ప్రక్రియలోని వివరాలతో ప్రస్తుత ఎంట్రీలు సరిపోలడం లేదని అర్ధం. శివరాజ్‌‌కుమార్‌ ‌విషయంలోనూ ఇదే కారణం చూపించారు. కామత్‌ ‌సోదరుల విషయంలో ‘తల్లిదండ్రుల పేర్లు సరిపోలడం లేదు’ అని కారణంగా చూపారు. ఎక్స్‌ ‌యూజర్‌ అవినాష్‌ ‌మోహన్‌ ఈ పేర్లను గుర్తించారు.

ఆధార్‌‌ను అమలు చేసిన యుఐడిఎఐ (యునిక్‌ ఐడెంటిఫికేషన్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా)కి నందన్‌‌ నీలేకని 2009 నుండి 2014 వరకు వ్యవస్థాపక చైర్మన్‌‌గా పనిచేశారు. ఈ ఏడాది జులైలో, యువత ఆందోళనల నేపథ్యంలో ధర్మేంద్ర ప్రధాన్‌ ‌విద్యా శాఖ మంత్రిగా రాజీనామా చేసిన తర్వాత ప్రధాని మోడీ మాట్లాడుతూ, ఎన్‌‌టిఎ (నేషనల్‌ ‌టెస్టింగ్‌ ఏజెన్సీ) పరీక్షల పునర్వ్యవస్థీకరణపై ఏర్పాటయ్యే ఉన్నత స్థాయి టాస్క్‌ ‌ఫోర్స్‌‌కు నందన్‌ నీలేకని నేతృత్వం వహిస్తారని ప్రకటించారు.

గౌరవనీయులైన భారత రత్న అవార్డు గ్రహీత ప్రొఫెసర్‌ ‌సి.ఎన్‌.ఆర్‌.రావు విషయంలో కూడా పేర్లు తేడా వున్నట్లు వెల్లడైంది. ఆయనకు గల హోదా, ఆయన అందించిన సేవలను దృష్టిలో వుంచుకుని ఆయనకు గానీ వారి కుటుంబ సభ్యులకు గానీ ఎలాంటి నోటీసు జారీ చేయలేదని ఎన్నికల కమిషన్‌ ‌వివరణ ఇచ్చింది. తుది జాబితాలోకి ఆయన పేరును చేర్చినట్లు తెలిపింది. ఎస్‌ఐఆర్‌ ‌వ్యత్యాసాల జాబితాలో సిఎన్‌ ‌రావు పేరు వుందని అనేక వార్తాపత్రికల్లో వార్తలు వచ్చిన నేపథ్యంలో ఇసి ఈ వివరణ ఇచ్చింది. ఇక పద్మశ్రీ అవార్డు గ్రహీత హరేకళ హజబ్బ కూడా పేరు సరిపోలడం లేదనే సమస్యను ఎదుర్కొన్నారు. అవసరమైన పత్రాలు తీసుకున్న తర్వాత అధికారులు ఆ సమస్యను పరిష్కరించారు. ఈ నెల 4నాటికి నో మ్యాపింగ్‌, అసమానతల కేటగిరీల కింద 43.81లక్షల నోటీసులు జారీ చేసినట్లు కర్ణాటక సిఇఒ తెలిపారు. వీటిపై విచారణలు అక్టోబరు 12వరకు కొనసాగుతాయని తెలిపారు. ప్రస్తుతం జారీ చేసిన ముసాయిదా ఓటర్ల జాబితాలో 4.46 కోట్ల మంది ఓటర్లు వున్నారు. ఎన్యూమరేషన్‌ ‌దశలో దాదాపుగా 1.07కోట్ల పేర్లు తొలగించారు.

ఢిల్లీలో 729 ఓట్లకు ఒక్కటే మిగిలింది...

ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర పరిశీలన (ఎస్‌ఐఆర్‌)‌ ప్రక్రియపై ప్రతిపక్ష పార్టీలు, హక్కుల కార్యకర్తలు వ్యక్తం చేస్తున్న ఆందోళనలు వాస్తవం అనిపించే సంఘటన ఢిల్లీలోని చాందని చౌక్‌ అసెంబ్లీ నియోజకవర్గంలో చోటు చేసుకుంది. ఇక్కడ లాల్ ఖిలా యమునా బ్రిడ్జ్ పోలింగ్ బూత్‌‌లో ఎస్‌ఐఆర్‌‌కు ముందు 2025 జాబితా ప్రకారం.. 729 మంది ఓటర్లు ఉండగా, ఆగస్టు 31న విడుదల చేసిన ముసాయిదా జాబితాలో కేవలం ఒక్క ఓటరు మాత్రమే మిగిలారు. దీనిపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎస్ఐఆర్‌ ‌సమయంలో అనధికార నివాస ప్రాంతాల్లో నివసించే వారు, పేదలు ఎదుర్కొనే దుస్థితికి ఇది ఒక సాక్ష్యమని పేర్కొంటున్నారు. మిగిలిన వ్యక్తుల ఓట్లతో పాటు ఈ బూత్‌‌లో దాదాపు మూడు దశాబ్దాల నుంచి బిజెపి ఏజెంట్‌‌గా పనిచేస్తూ, అక్కడే నివసిస్తున్న 74 ఏళ్ల గాయత్రీ దేవి ఓటు ముసాయిదా జాబితా నుంచి తొలగించడం గమనార్హం. ఎఎస్‌‌డిడి (గైర్హాజరు, బదిలీ, డూప్లికేట్‌ లేదా ‌మృతి చెందడం) కారణంతో గాయత్రి దేవి ఓటు తొలగించారు. సాయిదా జాబితా ప్రకారం మొత్తం 729 మంది ఓటర్లలో, ఒకరు గైర్హాజరయ్యారని, 632 మంది వేరే ప్రాంతానికి మారారని, 42 మంది మరణించారని, పది మంది డూప్లికేట్ ఓట్లు కారణాలతో తొలగించారు. మరో 43 మందిని 'ఇతరులు’ (ఇఎఫ్‌ పై సంతకం చేయడానికి నిరాకరించినవారు, ఇళ్లు ‌కూల్చివేతలకు గురైనవారు.. మొదలైనవారు)'గా వర్గీకరించారు. ఢిల్లీలో ఎస్‌ఐఆర్‌ ‌తరువాత ఓట్లు తొలగించడం ఈ బూత్‌‌కు మాత్రమే పరిమితం కాలేదు. ముసాయిదా జాబితా తరువాత ఓటర్ల సంఖ్య 1,45,10,299 నుంచి 97,53,577కు తగ్గింది. అంటే ఏకంగా దాదాపు 33 శాతం లేదా 47 లక్షలకు పైగా ఓటర్ల పేర్లను తొలగించారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్