బుధవారం, 23 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

సిఇసిపై అభిశంసన ప్రక్రియ ప్రారంభించాలి : ప్రతిపక్ష‍ాల డిమాండ్‌

1 గంట క్రితం

CEC Gyanesh Kumar
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 23, 2026, 12:25 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

న్యూఢిల్లీ : ప్రధాన ఎన్నికల కమిషనర్‌ (సిఇసి) జ్ఞానేష్‌ కుమార్‌పై పార్లమెంటు తక్షణమే అభిశంసన ప్రక్రియను ప్రారంభించాలని ప్రతిపక్ష పార్టీలు బుధవారం డిమాండ్‌ చేశాయి. ఎన్నికల సంఘంలోని ఇద్దరు కమిషనర్లు సుఖ్‌బీర్‌ సింగ్‌ సంధు, వివేక్‌ జోషి పది నెలల వ్యవధిలో కనీసం 14 సార్లు కీలక నిర్ణయాలపై అధికారికంగా అభ్యంతరాలు వ్యక్తం చేశారంటూ వెలువడిన కథనంపై ప్రతిపక్షాలు తీవ్రంగా స్పందించాయి. ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టు సుమోటోగా విచారణ చేపట్టాలని కూడా కోరాయి. ఎన్నికల సంఘంలో ముగ్గురు కమిషనర్లు ఉన్నప్పటికీ, పూర్తి కమిషన్‌కు తెలియకుండా కీలక నిర్ణయాలు తీసుకున్నారని, వాటిలో కొన్ని నిర్ణయాలు అనధికారికమైనవి, చట్టవిరుద్ధమైనవని ఇద్దరు ఎన్నికల కమిషనర్లు అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు వచ్చిన నివేదికను ప్రతిపక్షాలు ప్రస్తావించాయి. ఓటర్ల జాబితాల కేంద్రీకరణ, ఓటర్ల డేటాబేస్‌ నిర్వహణ, ఫారం-6లో మార్పులు, కొత్త ఓటర్ల నమోదు, ఓటర్ల పేర్ల తొలగింపు, పునరుద్ధరణ వంటి అంశాల్లో ఈ అభ్యంతరాలు వ్యక్తమైనట్లు తెలిపాయి. ఈ ఏడాది మేలో ఓటర్ల డేటాబేస్‌లో సంబంధిత చట్టబద్ధమైన అధికారులకు తప్ప మరెవరికీ మార్పులు చేసే అధికారం లేదని నిర్ధారించేందుకు ఆడిట్‌ నిర్వహించాలని ఎన్నికల కమిషనర్‌ వివేక్‌ జోషి ప్రతిపాదించినట్లు సమాచారం. ఆగస్టులో ఈరోనెట్‌ పోర్టల్‌కు రాష్ట్ర స్థాయి ఎన్నికల అధికారులకు పూర్తి ప్రాప్యత లేదని ఎన్నికల కమిషనర్‌ సుఖ్‌బీర్‌ సింగ్‌ సంధు అభ్యంతరం వ్యక్తం చేసినట్లు నివేదిక పేర్కొంది. చట్టబద్ధమైన అధికారుల ప్రాప్యత, స్వేచ్ఛను పరిమితం చేసే అధికారం ఈసీ ఐటీ డైరెక్టర్‌ జనరల్‌కు లేదని కూడా ఆయన పేర్కొన్నట్లు తెలిపింది. కొత్త ఓటర్ల నమోదు కోసం ఉపయోగించే ఫారం-6లో గత ఎస్‌ఐఆర్‌ ఓటర్ల జాబితాలో దరఖాస్తుదారు లేదా వారి తల్లిదండ్రులు, తాత,మామలు ఉన్నారా అనే వివరాలను అడిగేలా మార్పులు చేయడంపైనా ఇద్దరు కమిషనర్లు అభ్యంతరం వ్యక్తం చేసినట్లు సమాచారం. 1960 ఓటర్ల నమోదు నిబంధనలను సవరించకుండా ఫారంలో ఇలాంటి మార్పులు చేయలేమని వివేక్‌ జోషి మేలోనే హెచ్చరించగా, ఆగస్టులో సుఖ్‌బీర్‌ సింగ్‌ సంధు ఈ మార్పును అనధికారికం, చట్టవిరుద్ధమంటూ పేర్కొని తొలగించాలని కోరినట్లు నివేదిక తెలిపింది.


నివేదికలో పేర్కొన్న అంశాలు వాస్తవమైతే ఎన్నికల సంఘాన్ని ఏదో అదృశ్య శక్తి నడిపిస్తోందనే అనుమానం కలుగుతోందని కాంగ్రెస్‌ ఎంపీ మనీష్‌ తివారీ ఎద్దేవా చేశారు. సిఇసిపై అభిశంసన ప్రక్రియను పరిశీలించాల్సిన అవసరం ఉందని, అంతకంటే ముఖ్యంగా ఎన్నికల సంఘం విశ్వసనీయతను ఎలా పునరుద్ధరించాలనే దానిపై దృష్టి పెట్టాలని పేర్కొన్నారు. స్వతంత్ర రాజ్యాంగ సంస్థలోని సభ్యులకు స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశం లేకపోవడం, వారి అభిప్రాయాలకు ప్రాధాన్యత లేకపోవడం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్ష‍ుడు అఖిలేష్‌ యాదవ్‌ పేర్కొన్నారు. ఈ వ్యవహారాన్ని సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించాలని కోరారు. సిఇసి జ్ఞానేష్‌ కుమార్‌ నేతృత్వంలోని ఎన్నికల సంఘం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని సిపిఐ(ఎం) ఎంపి జాన్‌ బ్రిట్టాస్‌ మండిపడ్డారు. ఇద్దరు ఎన్నికల కమిషనర్లు పది నెలల్లో 14 సార్లు అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు వచ్చిన నివేదికపై పార్లమెంటు వెంటనే స్పందించాలని, సీఈసీని తొలగించే ప్రక్రియను ప్రారంభించాలని డిమాండ్‌ చేశారు. ఎస్‌ఐఆర్‌ ప్రక్రియపై కూడా సుప్రీంకోర్టు తక్షణమే జోక్యం చేసుకోవాలని కోరారు. సిఇసి జ్ఞానేష్‌ కుమార్‌ను తొలగించాలని కోరుతూ ఐదు నెలల క్రితమే 60 మందికి పైగా రాజ్యసభ సభ్యులు ఛైర్మన్‌కు లేఖ రాశారని తృణమూల్‌ కాంగ్రెస్‌ రాజ్యసభ ఎంపీ డెరెక్‌ ఓ'బ్రియన్‌ గుర్తుచేశారు. ఇద్దరు ఎన్నికల కమిషనర్లు సిఇసి తీసుకున్న పలు చర్యలను వ్యతిరేకించినట్లు వచ్చిన తాజా నివేదిక నేపథ్యంలో అభిశంసన తీర్మానాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన సమయం వచ్చిందని అన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్