బెంగళూరు: బెంగళూరులో నకిలీ క్యాన్సర్ మందుల విక్రయ దందాను పోలీసులు ఛేదించారు. బెంగళూరు పోలీసులు, డ్రగ్ కంట్రోల్ విభాగం సంయుక్తంగా నిర్వహించిన తనిఖీల్లో ఈ అక్రమ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో మినర్వా సర్కిల్ సమీపంలోని ‘కృపా హెల్త్‌కేర్’ ఫార్మసీ యజమాని వీరేష్ కుమార్ జైన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. బెంగళూరు నగరంలోని 90కి పైగా ఆసుపత్రులు, క్లినిక్‌లు, మెడికల్ షాపులకు నకిలీ, రీప్యాకేజ్ చేసిన మందులను సరఫరా చేసినట్లు దర్యాప్తులో గుర్తించారు. క్యాన్సర్ చికిత్సకు ఉపయోగించే మందులతో పాటు ప్రాణరక్షక మందులు, ఐసీయూ ఇంజెక్షన్లను సైతం విక్రయించినట్లు పోలీసులు తెలిపారు. వీటిని ఆసుపత్రులు, క్లినిక్‌లు, మెడికల్ షాపులకు మార్కెట్ ధర కంటే సుమారు 50 శాతం తక్కువకు విక్రయించినట్లు గుర్తించారు.
తక్కువ ధరలకు మందులను కొనుగోలు చేసి, వాటి బ్రాండ్ పేర్లు మార్చి వివిధ పేర్లతో విక్రయించడం ఈ ముఠా పద్ధతిగా పోలీసులు గుర్తించారు. గడువు ముగిసిన మందులను కొత్త ప్యాకెట్లలోకి మార్చి, ప్రముఖ ఫార్మాస్యూటికల్ కంపెనీల లేబుళ్లను పోలిన నకిలీ లేబుళ్లతో విక్రయించినట్లు దర్యాప్తు అధికారులు వెల్లడించారు. ఈ దందాలో సుమారు 15 మంది పాల్గొన్నట్లు సమాచారం.
ఆగస్టు 18న దక్షిణ బెంగళూరులోని బిడది, దోదేరి ప్రాంతాల్లోని ఓ ఫామ్‌హౌస్‌లో సోదాలు నిర్వహించిన పోలీసులు సుమారు రూ.5 కోట్ల విలువైన నకిలీ మందులను స్వాధీనం చేసుకున్నారు. నకిలీ బిల్లులు, ఇంజెక్షన్ డ్రగ్ ఫిల్లింగ్ పరికరాలు, నకిలీ లేబుళ్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఈ వ్యవహారంపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.
సిట్ బృందం కర్ణాటకతో పాటు హర్యానా, హిమాచల్‌ప్రదేశ్, తమిళనాడు, మహారాష్ట్రల్లోని 10కి పైగా ప్రాంతాల్లో సమన్వయంతో సోదాలు నిర్వహించింది. నకిలీ మందుల దందాకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలు, ఇందులో పాల్గొన్న ఇతర వ్యక్తులపై దర్యాప్తు కొనసాగుతోంది.








కామెంట్‌లు (0)