సోమవారం, 03 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

గుజరాత్‌ ప్రభుత్వ పాఠశాలల్లో భారీగా బాలికల డ్రాపౌట్స్‌

1 రోజు క్రితం

gujarat
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 03, 2026, 12:11 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

- ఎస్‌‌సి, ఎస్‌‌టిల్లో పరిస్థితి మరింత దారుణం

- వెల్లడించిన కేంద్ర ప్రభుత్వం

న్యూఢిల్లీ : గత ఐదేళ్లలో గుజరాత్‌ ‌ప్రభుత్వ పాఠశాలల్లో బాలికల డ్రాపౌట్స్‌ ‌సంఖ్య గణనీయంగా పెరిగింది. కిందిస్థాయి తరగతుల్లో వీరి సంఖ్య ఎక్కువగానే ఉంటున్నా.. నాలుగో తరగతికి వచ్చేసరికే బాలికల సంఖ్య భారీగా పడిపోతోంది. ఎస్‌‌సి, ఎస్‌‌టి విద్యార్థుల్లో ఈ పరిస్థితి మరింత దారుణంగా ఉంటుంది. ఈ వివరాలను కేంద్ర ప్రభుత్వమే ఇటీవల పార్లమెంట్‌ ‌సమావేశాల్లో వెల్లడించడం విశేషం. కొన్ని రోజుల క్రితం లోక్‌‌సభకు కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ సమర్పించిన నివేదిక ప్రకారం.. గుజరాత్‌ ‌ప్రభుత్వ పాఠశాలల్లో 5వ తరగతికి వచ్చే సరికి బాలికల స్థూల నమోదు నిష్పత్తి (జిఇఆర్‌) గత ఐదేళ్ల క్రితం 95.8 శాతం ఉండగా, ప్రస్తుతం అది 19.3 పాయింట్లు క్షీణించి, 76.5 శాతానికి దిగజారింది. ఎస్‌‌సి, ఎస్‌‌టి విద్యార్థుల్లో జిఇఆర్‌ ‌మరింత దిగజారిందని నివేదిక వెల్లడించింది.

షెడ్యూల్డ్ కులాల (ఎస్‌‌సి)లకు చెందిన విద్యార్థులలో ఐదేళ్ల క్రితం 87.0 శాతంగా ఉన్న జిఇఆర్‌ నాలుగో తరగతికి వచ్చే సరికి 67 శాతానికి తగ్గింది. షెడ్యూల్డ్ ట్రైబ్స్‌ (ఎస్‌‌టి) విద్యార్థుల విషయానికొస్తే 96.6 శాతంగా ఉన్న జిఇఆర్‌ 70 శాతానికి తగ్గింది. బాలికలు, ఎస్‌‌సి, ఎస్‌‌టి విద్యార్థులందరూ ఫౌండేషన్‌ ‌దశలో పాఠశాలలకు రెగ్యులర్‌గా హాజరై, ఆ తర్వాత అంటే మూడు, నాలుగు తరగతుల్లోనే భారీ సంఖ్యలో పాఠశాలలకు దూరమవుతున్నారు.

లోక్‌‌సభకు తెలిపిన కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ లెక్కల ప్రకారం గుజరాత్‌లో 2021-22లో 34,699 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా 2025-26 నాటికి 34,734కి పెరిగాయి. ఎన్ని పాఠశాలలు మూసివేశారు, ఎన్ని విలీనం చేశారు, ఎన్ని కొత్తగా ప్రారంభించారు లేదా పునర్‌వర్గీకరించబడ్డాయి అనే వివరాలను ఈ డేటా ప్రత్యేకంగా వివరించలేదు. గుజరాత్‌‌లో పాఠశాలల మొత్తం సంఖ్య పెరగడాన్ని చూసి ఈ రాష్ర్టంలో ఎలాంటి మూసివేతలు జరగలేదనడానికి సాక్ష్యంగా భావించలేమని విద్యారంగానికి చెందిన నిపుణులు అంటున్నారు. డ్రాపౌట్స్‌ ‌భారీగా పెరగడానికి జనాభా వలసలతోపాటు పాఠశాలల మూసివేతలు ప్రధాన కారణాలుగా ఉంటాయని నిపుణులు తెలుపుతున్నారు.

12వ తరగతిని సగం మంది విద్యార్థులు పూర్తి చేయడం లేదు

గుజరాత్‌‌లో డ్రాపౌట్స్‌ ఎక్కువగా ఉన్నాయని కేంద్ర ప్రభుత్వ నివేదికలే వెల్లడిచేయడం ఇదే మొదటిసారి కాదు. ‘గుజరాత్‌‌లో సగం మంది విద్యార్థులు 12వ తరగతి పూర్తి చేయలేదని కేంద్ర ప్రభుత్వ సుస్థిర అభివృద్ధి లక్ష్యాల (ఎస్‌డిజి) పురోగతి నివేదిక పేర్కొంది. కేవలం 50.82 శాతం మంది విద్యార్థులు మాత్రమే 12వ తరగతి పూర్తి చేస్తున్నారు. ఇది జాతీయ సగటు 61.14 శాతం కంటే గణనీయంగా తక్కువ. కళాశాల ప్రవేశాల విషయంలో దేశంలోనే గుజరాత్‌ 23వ స్థానంలో ఉంది. జాతీయ స్థాయితో పోలిస్తే భాషా ప్రావీణ్యం, గణిత నైపుణ్యంలో గుజరాత్‌ ‌విద్యార్థులు చాలా వెనుకబడి ఉన్నారు. ​


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్